తెలంగాణ

telangana

ETV Bharat / state

Amaravathi Padayatra: జోరుగా అమరావతి పాదయాత్ర.. పాల్గొన్న భాజపా నేతలు

Amaravathi Padayatra: అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర 33వ రోజు ఉత్సాహంగా సాగింది. ఇవాళ తురిమెర్ల నుంచి ప్రారంభమైన యాత్ర.. వెల్లువెత్తుతున్న ప్రజామద్దతుతో సైదాపురం వద్ద ముగిసింది. భాజపా జాతీయ నేతలు యాత్రలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.

Amaravathi Padayatra
Amaravathi Padayatra

By

Published : Dec 3, 2021, 10:51 PM IST

Amaravathi Padayatra: ఏపీకి ఏకైక రాజధాని అమరావతే లక్ష్యంగా రైతుల మహా పాదయాత్ర సాగుతోంది. నెల్లూరు జిల్లా తురిమెర్ల నుంచి 33వ రోజు యాత్ర ప్రారంభమైంది. ఇవాళ 10 కిలోమీటర్ల మేర సాగిన యాత్ర.. సైదాపురం వద్ద ముగిసింది. రైతులు రాత్రికి సైదాపురం వద్దే బస చేయనున్నారు. కాగా.. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో.. ఈనెల 17న అమరావతి రైతుల సభకు అనుమతి కోరామని అమరావతి ఐకాస కన్వీనర్​ శివారెడ్డి తెలిపారు. సభకు అనుమతిపై ఇవాళ, రేపు ఎదురుచూస్తామని చెప్పారు. అనుమతి రాకపోతే ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

పెరుగుతున్న ప్రజా మద్దతు..
రాజధాని రైతుల 33వ రోజు మహా పాదయాత్రకు నెల్లూరు జిల్లాలో ప్రజలు అగుడుగునా మద్దతు తెలిపారు. గ్రామాలకు గ్రామాలు జై అమరావతి అని నినదిస్తుండడంతో.. ఆయా ప్రాంతాలు జనజాతరను తలపించాయి. పూలు, మంగళ హారతులు, జేజేలతో రైతులకు ఘనస్వాగతం పలికారు. అమరావతి 29 గ్రామాల సమస్య కాదని.. ఏపీ ప్రజల భవిష్యత్ అని నినదిస్తూ రైతులు ముందుకు సాగారు. ఉదయం తురిమెర్ల నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర ఊటుకూరు, జోగుపల్లి, గిద్దలూరురోడ్డు, పెరుమాళ్లపాడు రోడ్డు, కొక్కందలరోడ్డు మీదుగా మొలకలపుల్ల రోడ్డు వరకు సాగింది. భోజన విరామం తర్వాత అక్కడి నుంచి రైతులు సైదాపురం వరకు తమ పాదయాత్రను కొనసాగించారు. పాదయాత్ర సాగిన ప్రాంతమంతా జై అమరావతి నినాదాలతో హోరెత్తింది. స్థానిక ఆడపడుచులు, యువత, రైతులు పాదయాత్రలో పాల్గొన్న రైతులను ఆప్యాయంగా పలకరిస్తూ మద్దతు తెలిపారు.

అమరావతే ఏపీ రాజధాని: భాజపా

అమరావతి రైతుల మాహాపాదయాత్రలో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్​ పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. అకుంఠిత దీక్షతో యాత్ర చేస్తున్న రైతులకు భాజపా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి అమరావతే రాజధానిగా మిగిలిపోతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఓ తుగ్లక్ చేస్తున్న పరిపాలన అంతమొందుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కాకముందు అనేక కేసుల్లో ఉన్న జగన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడో.. అక్కడికే వెళ్తారన్నారు.

అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటునిచ్చిందని సత్యకుమార్ తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వికృత క్రీడకు ఈ ముఖ్యమంత్రి జగన్​ తెరలేపారని ధ్వజమెత్తారు. అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకే విశాఖ రాజధాని అంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే జగన్ రెడ్డిలా ఊరికో ప్యాలెస్ కట్టుకోవడం కాదన్నాారు. ఏమాత్రం ఇంగితజ్ఞానం లేకుండా సీఎం నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు.

రహస్య బ్యాలెట్ నిర్వహించాలి..

వైకాపా నేతల్లో 95 శాతం మంది అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని అమరావతి పరిరక్షణ ఐక్య వేదిక కన్వీనర్​ శివారెడ్డి అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి తన పార్టీ నేతలకు అమరావతిపై రహస్య బ్యాలెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమ పాదయాత్రకు పోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్న వైకాపా నేతలు.. ఆ డబ్బుని తమ ఊర్లలో రోడ్లు బాగు చేసుకునేందుకు వెచ్చిస్తే మంచిదని హితవుపలికారు.

ఇదీచూడండి: KTR Tweet to PM: ప్రధానికి కేటీఆర్​ ట్వీట్​.. జాతీయహోదా ఇవ్వాలని విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details