తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆల్‌ రౌండర్‌ మేఘన - HAND BALL

ఆర్థిక స్థితి ఆ అమ్మాయి లక్ష్యాన్ని ఆపలేదు. ఒకటి కాదు రెండు కాదు.. పదకొండేళ్లకే బహుముఖ క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించింది. మొత్తం 8 క్రీడల్లో రాణిస్తూ.. అందరి ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోంది.

ఆల్‌ రౌండర్‌ మేఘన

By

Published : Mar 8, 2019, 7:37 PM IST

ఆల్‌ రౌండర్‌ మేఘన
పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తోంది మేఘన. జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన రాజరాపు రమేశ్, జమున దంపతులచిన్న కూతురు మేఘన. నివాసం హైదరాబాద్‌ న్యూబోయిన్‌పల్లిలో. చిన్న వయసునుంచే క్రీడలంటే మక్కువ. ఆరో తరగతి చదువుతున్న ఆ చిన్నారి ఇప్పటికే పలు రాష్ట్ర, జాతీయ స్థాయి ఆటల్లో పాల్గొని పతకాలు సాధించింది.

ఆటల్లో ఆల్‌ రౌండర్

మేఘన పరుగుపందెం, హ్యాండ్‌ బాల్‌, త్రోబాల్‌, టెన్నికాయిట్‌, ఫిస్ట్‌ బాల్‌, లాంగ్‌ జంప్‌, ఖోఖో, కబడ్డీ ఇలా విభిన్న క్రీడల్లో రాణిస్తూ.. అందరి ప్రశంసలు అందుకుంటోంది. టైగర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖోఖో పోటీల్లో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించింది. రాష్ట్ర స్థాయిలో కబడ్డీ, హ్యాండ్‌బాల్‌ పోటీల్లో రజత పతకాలు దక్కించుకుంది. మే నెలలో గుజరాత్‌లో నిర్వహించే అండర్‌ 14 ఖోఖో పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది.

దేశానికి బంగారు పతకం కోసం కృషి

మేఘన ఇప్పటివరకు రెండు జాతీయ స్థాయి, 11 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు, రజత పతకాలు సాధించిందని వ్యాయామ ఉపాధ్యాయుడు తెలిపారు. గతేడాది అంతర్జాతీయ స్థాయిలో ఫిస్ట్‌బాల్‌కు ఎంపికైనప్పటికీఖర్చుతో కూడుకున్నదని వెళ్లలేకపోయిందన్నారు.

రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో దేశానికి బంగారు పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది మేఘన.పేదరికంతో కొన్ని క్రీడలకు వెళ్లలేకపోతున్న మేఘనకు ఎవరైనా ఆర్థికంగా సాయపడితే క్రీడల్లో మరింత రాణించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ క్రీడాకారిణికి చేయూత లభిస్తుందని ఆశిద్దాం.

ABOUT THE AUTHOR

...view details