Peddapeta ideal woman farmer : ఇటీవల కాలంలో మహిళలు వ్యవసాయంలో సత్తా చాటుతున్నారు. తమదైన స్టయిల్లో సాగు చేస్తూ... ఉత్తమ రైతులుగా నిలుస్తున్నారు. వినూత్న ఆలోచనలతో సాగు చేస్తూ... మంచి లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయం చేయాలనే ఆసక్తితో సాగువైపుగా మళ్లి... ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళా రైతు రజిత.
యూట్యాబ్ చూస్తూ... సాగు
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దపేటకు చెందిన రజితకు వ్యవసాయం చేయడమంటే ఇష్టం. గతంలో సాగు పనులు చేసిన అనుభవంతో ముందడుగు వేశారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల గురించి ఆరా తీశారు. బ్రాహ్మణపల్లి శివారులో మూడెకరాల భూమిని సాగుకోసం ఎంచుకున్నారు. పరిస్థితులకు అనుగుణంగా తక్కువ పెట్టుబడితో బంతిపూలు సాగు చేశారు. అనుకున్నదానికంటే రెట్టింపు లాభం గడించారు. ఎకరన్నర పొలంలో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. మార్కెట్‌లో వచ్చే మార్పులకు అనుగుణంగా... యూట్యూబ్‌లో చూసి సాగులో మెలకువలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.
స్టార్టింగ్ వ్యవసాయం నార్మల్గా చేద్దాం అనుకున్నాం. ఆ తర్వాత మార్కెటింగ్ సమస్య వల్ల కూరగాయలు, పూలు, పండ్లు సాగు మొదలుపెట్టాం. బంతి సాగు మేం ఊహించిన దానికంటే మంచి లాభాలు వచ్చాయి. ఇక అంతర పంటలుగా మునగ, క్యాబేజ్, కాలీఫ్లవర్, మిర్చి వంటివి ఉన్నాయి. వ్యవసాయంలో ఏం మిగలడం లేదు అనేది అవాస్తవం. అందులో దిగి.. ఇష్టంగా కష్టపడి సాగు చేస్తే చాలామంచి ఫలితాలు వస్తాయి.
-రజిత, సాగుదారు