తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీ నుంచి తప్పించుకుంది.. ముంబయితో ముప్పొచ్చింది - corona positive case in jagtial

కరోనా వైరస్‌ నేపథ్యంలో దిల్లీ ముప్పు నుంచి తప్పించుకున్న జగిత్యాల జిల్లాకు ముంబయి లొల్లి మొదలైంది. ముంబయి నుంచి వచ్చిన వలస కూలీల్లో ఒకరికి కరోనా పాజిటివ్​ రాగా గాంధీ ఆసుపత్రికి తరలించారు.

a person got corona positive in jagtial district as he came from mumbai recently
ముంబయితో ముప్పొచ్చింది

By

Published : May 15, 2020, 8:13 AM IST

జగిత్యాల జిల్లాకు ముంబయి సహా ఇతర ప్రాంతాల నుంచి 2,712 మంది రాగా వారందరినీ సరిహద్దుల్లోనే స్క్రీనింగ్‌ నిర్వహించి 28 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ముద్రలు వేశారు. ఈనెల ముంబై నుంచి వచ్చిన వారిలో గురువారం మరొకరికి పాజిటివ్‌ వచ్చింది. వెల్గటూరు మండలానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌ రావటంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆరుకు చేరగా ముగ్గురు చికిత్స పొంది ఇంటికి చేరారు. ఈనెల 3న మల్యాల మండలానికి చెందిన వృద్ధుడు గాంధీ ఆస్పత్రిలోనే ఉండగా బుధ, గురువారాల్లో పాజిటివ్‌గా తేలిన వెల్గటూరు మండలానికి చెందిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మరో నలుగురు అనుమానితులు చికిత్స పొందుతుండగా వారి రక్తనమూనాల నివేదికలు నేడు రానున్నాయి.

ఉల్లం‘ఘనుల’పై కేసులు

ముంబయి తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన 2712 మందిని గృహ సంరక్షణలో ఉండాల్సిందిగా పేర్కొన్నప్పటకీ నిబంధనలు పాటించక పోవటంతో జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. 28 రోజులు గృహ సంరక్షణ (హోం క్వారెంటైన్‌)లో ఉండకుండా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆదేశించారు. ఈ నేపథ్యంలో జగిత్యాల ఆర్డీవో గంటా నరేందర్‌ గురువారం గొల్లపల్లి, వెల్గటూరు, ధర్మపురి, బీర్‌పూర్‌ మండలాల్లో ఏడుగురిని గుర్తించారు. వారందరిపై కేసులు నమోదు చేసి కొండగట్టు జేఎన్‌టీయూ కళాశాలలోని ప్రభుత్వ క్వారెంటైన్‌ హోంకు తరలించారు.

కోరుట్ల మండలంలోనూ ఒకరిపై కేసు నమోదు చేసి జేఎన్‌టీయూ క్వారెంటైన్‌ హోంకు తెచ్చారు. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ప్రజలు కొన్ని గ్రామాల్లో ఇళ్లల్లోకి రానీయటం లేదు. దీంతో గ్రామం బయట పాఠశాలలు, సామాజిక భవనాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ముంబై తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కాగా గొల్లపల్లి మండలానికి చెందిన ఒకరు ఇటీవల ముంబై నుంచి రాగా కరోనా లక్షణాలతో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరారు. అతని కుమారుడు ధర్మపురిలో ఓ బ్యాంకులో పనిచేస్తుండటంతో ముందు జాగ్రత్తగా గురువారం బ్యాంకును మూసివేసి శానిటైజేషన్‌ చేశారు. 12 మంది ఉద్యోగులను సైతం హోం క్వారెంటైన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు.

హోంక్వారంటైన్‌లో ఉండాల్సిందే

జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా హోం క్వారెంటైన్‌లో ఉండాల్సిందేనని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి చెప్పారు. గురువారం నాటికి 2712 మంది వచ్చారని వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి 28 రోజులు హోం క్వారెంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించామని ఉల్లంఘించిన 8 మందిపై కేసులు నమోదు చేసి కొండగట్టు జేఎన్‌టీయూకు తరలించామన్నారు. ముంబై నుంచి వచ్చిన వారిలో వెల్గటూరు మండలానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రాగా వారిని గాంధీ ఆస్పత్రికి తరలించామన్నారు. వారద్దరినీ ముందుగానే గుర్తించి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్చటంతో ముప్పు తప్పిందన్నారు. జిల్లా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆరుకు చేరగా ముగ్గురు ఇది వరకే చికిత్స పొంది ఇళ్లకు చేరారని కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని ప్రజలు విధిగా మాస్కులు, వ్యక్తిగత దూరం పాటించాలని లేనట్లయితే జరిమానాలు విధిస్తామని కలెక్టర్‌ చెప్పారు.

- కలెక్టర్‌ రవి

ABOUT THE AUTHOR

...view details