వానాకాలం చదువులపై స్పందించిన కలెక్టర్ 400 మందికి పైగా చదువుకుంటున్న జగిత్యాల జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సరైన వసతుల్లేక విద్యార్థినుల అవస్థలు వర్ణణాతీతం. శిథిలమైపోయిన భవనాల్లో... వర్షమొస్తే గొడుగు వేసుకుని... ఎండ కాస్తే చెమటతో తడిచిపోతూ ఎప్పుడు ఏ భవనం కూలిపోతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ చదువు సాగిస్తున్న ఆ విద్యార్థినుల కష్టాన్ని ఈటీవీ భారత్ 'వానకాలం చదువులంటే ఇవేనేమో' అనే శీర్షికతో వెలుగులోకి తెచ్చింది.
అలా వెలుగులోకి వచ్చింది.... ఇలా స్పందన వచ్చింది
దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ శరత్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. శిథిల వ్యవస్థలో ఉన్న భవనాల్లో విద్యార్థినుల అవస్థలు ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. సాధ్యమైనంత త్వరలోనే నూతన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా ఇబ్బంది కలగకుండా సోమవారం నుంచే భవనాల మరమ్మతులు చేయిస్తామన్నారు. కలెక్టర్ స్పందనపై విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని సంతోషంగా ఉన్నారు.
ఇదీ చూడండి: వానకాలం చదువులంటే ఇవేనేమో..!