National Award for Korutla : జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ పేరు చెప్పగానే ఇప్పుడు అందరికీ గుర్తు వచ్చేది అవార్డులు. నాలుగు సంవత్సరాల్లోనే ఏడు అవార్డులు దక్కించుకుని అందరి చేత భేష్ అనిపించుకుంటోంది కోరుట్ల మున్సిపాలిటీ. 85 వేల జనాభాతో కూడిన కోరుట్ల మున్సిపాలిటీలో 33వార్డులలో శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. పురపాలక పారిశుద్ధ్య కార్మికుల నుంచి పుర ఛైర్‌పర్సన్, కమిషనర్ వరకు సమష్టిగా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. పట్టణ పరిశుభ్రతకు పాటుపడుతూ స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్ది రాష్ట్ర, జాతీయస్థాయిలో వివిధ కేటగిరీలో అవార్డులను సొంతం చేసుకుంది.
Korutla municipality wins National Awards : 2022 సంవత్సరానికిగాను కోరుట్ల మున్సిపల్ ఉత్తమ మున్సిపాలిటిగా ఎంపికైయ్యింది. 2019లో నూతన మున్సిపల్ చట్టం ప్రకారం పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీలో ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచారు. నిత్యం పారిశుధ్య కార్మికులు ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి... దీని ద్వారా ఎరువును తయారుచేసి మంచి లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలో ఎటు చూసినా పచ్చదనం, పురపాలక కార్యాలయంలో కూడా పచ్చదనంతో కనివిందు చేస్తుంది.
'మా కోరుట్లకి జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. పట్టణ ప్రగతి అవార్డు వచ్చింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్ చేతులమీదుగా ఉత్తమ మున్సిపాలీటిగా అవార్డు తీసుకున్నాం. హరితహారంలో కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాం. వీటన్నింటికి కారణం పట్టణ ప్రగతిలో ప్రజలు మాకెంతో సహకరించడమే. ముఖ్యంగా మహిళలు ఇందుకు కారణం. మహిళా ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి పారిశుద్ధ్యంపై అందరికీ అవగాహన కల్పించారు.' - అయాజ్, మున్సిపల్ కమిషనర్.