తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ఆర్టీసీలో మళ్లీ జోనల్‌ వ్యవస్థ

ఆర్టీసీలో మళ్లీ జోనల్‌ వ్యవస్థ తెరపైకి వచ్చింది. ఏపీఎస్‌ఆర్టీసీతో అంతర్‌ రాష్ట్ర సర్వీసుల ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినందున జోనల్‌ వ్యవస్థ వైపు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు అధికారులు చెబుతున్నారు.

tsrtc
తెలంగాణ ఆర్టీసీలో మళ్లీ జోనల్‌ వ్యవస్థ

By

Published : Nov 14, 2020, 9:24 AM IST

తెలంగాణ ఆర్టీసీలో జోనల్‌ వ్యవస్థ మళ్లీ తెరపైకి వచ్చింది. పర్యవేక్షక వ్యవస్థలు ఎక్కువయ్యాయన్న కారణంతో గతంలో ప్రాధాన్యాన్ని తగ్గించారు. ఇటీవల కాలంలో టీఎస్‌ఆర్టీసీ.. కార్గో-పార్శిల్‌ వ్యవస్థలను ప్రారంభించింది. ఏపీఎస్‌ఆర్టీసీతో అంతర్‌ రాష్ట్ర సర్వీసుల ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినందున జోనల్‌ వ్యవస్థ వైపు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు అధికారులు చెబుతున్నారు. ఆక్యుపెన్సీ, ఆదాయం పెంపుదలకు సూక్ష్మస్థాయిలో ప్రణాళికలను రూపొందించేందుకు జోనల్‌ కమిషనర్ల వ్యవస్థను వినియోగించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. బస్సుల హేతుబద్ధీకరణ, నూతన సర్వీసుల కసరత్తు తదితర అంశాలపై జోనల్‌ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం కసరత్తు చేయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. ఇటీవల వరకు హైదరాబాద్‌ సిటీకి మాత్రమే జోనల్‌ కమిషనర్‌ ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌ (నగరం మినహా), కరీంనగర్‌ జోన్లకుగాను ఒక జోనల్‌ కమిషనర్‌ను ఆర్టీసీ నియమించింది. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన మునిశేఖర్‌కు ఆ రెండు జోన్ల బాధ్యతలను అప్పగించింది.

త్వరలో మరో ఇద్దరు ఈడీలు
త్వరలో మరో రెండు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు(ఈడీ) పోస్టులకు ప్రభుత్వం అధికారులను నియమించనుంది. ఇటీవల పదోన్నతి ద్వారా ఒక పోస్టును భర్తీ చేసింది. త్వరలో కార్గో-పార్శిల్‌ వ్యవస్థకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ను నియమించనుంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా ఉన్న కృష్ణకాంత్‌ పదోన్నతికి సంబంధించిన దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. పరిపాలనా వ్యవహారాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న వెంకటేశ్వరరావు ఆకస్మిక మృతితో ఆ పోస్టులో ఎవరినీ నియమించలేదు. త్వరలో పదోన్నతిపై ఆ పోస్టును కూడా భర్తీ చేయనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్​

ABOUT THE AUTHOR

...view details