Lokesh Comments on YS Jagan : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాద్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కుప్పం నుంచి ప్రారంభమైంది. తన యువగళం ఓ పాదయాత్ర మాత్రమే కాదు, యువతకు పోరాడే వేదిక అని ఆయన స్పష్టం చేశారు. యువత ను మోసం చేసిన జాదూ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. మైసూర్ బోండాలో మైసూర్ లేనట్లే జాదూ రెడ్డి జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు లేవని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం కంచుకోట కు మారుపేరు కుప్పం అని వెల్లడించారు. యువగళం ప్రజాబలమన్నారు. యువగళం పేరు వినగానే వైకాపా నేతల ప్యాంట్లు తడిచాయని ధ్వజమెత్తారు.
పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని తెలిపారు. మూడున్నరేళ్లుగా వైకాపా నేతలు ఏం పీకారని ప్రశ్నించారు. క్యాసినో లు పెడితే పరిశ్రమలు రావని వైకాపా నేతలు గుర్తించాలని హితవు పలికారు. 3ఏళ్లలో రాష్ట్రాన్ని 67ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని దుయ్యబట్టారు. యువత, రైతులు మహిళలు ఇలా అన్ని వర్గాలు ఈ ప్రభుత్వ బాధితులేనన్నారు.
జాదూరెడ్డిని ఇంటికి పంపిద్దాం:‘‘యువతకు హామీ ఇస్తున్నా.. త్వరలోనే యువతకు ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకు రాబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేటు రంగం నుంచి ఎన్ని? స్వయం ఉపాధి ద్వారా ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో స్పష్టంగా అందులో ప్రకటిస్తాం. ఏటా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కౌలు రైతులకు ప్రత్యేక కార్యాచరణ తీసుకొచ్చి ఆదుకుంటాం. ప్రభుత్వ వైఫ్యలాలను విమర్శిస్తే.. నాకు చీరలు, గాజులు పంపుతామని ఓ మహిళా మంత్రి అన్నారు.
పంపించండి చీర, గాజులు.. మా అక్కలు, చెళ్లెల్లకు ఇస్తా. చీర కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతగానివాళ్లా? అని అడుగుతున్నా. మీ జగన్ మాదిరిగా తల్లీ, చెల్లిని బయటకు గెంటలేదు. మంత్రి పదవిలో ఉన్న వాళ్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఏ1 తెచ్చిన జీవో1తో అడ్డుకోవాలని చూస్తారా? పవన్ కల్యాణ్ పోరాటాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. పవన్ వారాహి వాహనానికి ఆంక్షలు పెడుతున్నారు.