ys Sharmila fire on govt : ర్యాలీ, సభలు, సమావేశాలపై నిషేధం విధిస్తూ గత నెల 25న జీవో ఇచ్చినా... నల్గొండ జిల్లాలో ర్యాలీ, సభలు ఎలా పెడతారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల నిలదీశారు. కొవిడ్ నిబంధనలు... కేవలం ప్రతిపక్షాలకేనా...అధికార పార్టీకి వర్తించవా అని ప్రశ్నించారు. రైతు ఆవేదన యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వరంగల్‌తోపాటు పలు ప్రాంతాలకు చెందిన ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను లోటస్‌పాండ్‌కు పిలిపించి... పరామర్శించారు. వారి సమస్యలు తెలుసుకుని ఆర్థిక సాయం చేశారు.
రైతుల ఆత్మహత్యల రాష్ట్రంగా మారింది..
తెలంగాణ... రైతుల ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని షర్మిల ఆరోపించారు. ఏడేళ్ల కాలంలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. పండిన పంట అమ్ముకోలేక కొందరు, ధరణి సమస్యలతో ఇంకొందరు.. అప్పులతో మరికొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతుబంధు పేరున ఎకరాలకు 5వేలు ఇచ్చి...రైతులకు ఇవ్వాల్సిన 25వేల రాయితీలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే... ఏ ఒక్క బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇంత మంది చనిపోతే పట్టించుకోని ముఖ్యమంత్రి.... ఎక్కడో హర్యానాలో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తారంటని ఎద్దేవా చేశారు. ఏ మాత్రం నైతికత ఉన్నా... రైతుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.