Sharmila Fire On Kcr: ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు అని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ మూడేళ్లకే ఎలా ముంపునకు గురైందో చెప్పాలని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అవినీతికి కాళేశ్వరం సాక్ష్యమని ఆమె ఆరోపించారు. ప్రాజెక్టుపై జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయంలో తెలంగాణ చీఫ్ ఇంజనీర్‌ను కలిసి షర్మిల వినతిపత్రం అందజేశారు.
అనంతరం చీఫ్ ఇంజనీర్‌ను నుంచి సరైనా సమాధానం రాలేదని ఆరోపిస్తూ.. కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి వైఎస్ షర్మిల ఆందోళనకు దిగారు. పేదల కడుపుకొట్టి బడా కాంట్రాక్టర్ల కడుపు నింపేందుకు తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం, కాంట్రాక్టర్లు లాభపడ్డారు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్నారు. త్వరలోనే గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై విచారణ జరపించాలని కోరనున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు.
"ఈ రెండు మూడేళ్లకే బాహుబలి మోటార్లు మునిగిపోయాయి. పంపుహౌస్‌ల ఎత్తు చూడకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దేశ చరిత్రలో ఒక ఎకరాకు నీరు అందించని ప్రాజెక్టు కాళేశ్వరం. సీఎం కేసీఆర్ ప్రపంచ చరిత్రలోనే అతిగొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. బాహుబలి మోటార్లు అన్నారు. ఏమైంది మూడేళ్లకే మునిగిపోయింది." -వైఎస్ షర్మిల వైతెపా అధ్యక్షురాలు