వైఎస్ఆర్టీపీలో పార్టీ పదవులు రూ.5 లక్షలకు అమ్ముకుని రాత్రికి రాత్రే పేర్లు మార్చేసారని దేవకద్రకు చెందిన ఆ పార్టీ కార్యకర్త నర్సింహారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పార్టీ అధినేత షర్మిలను వ్యతిరేకించడం లేదని.. పార్టీలో ఉన్న కోవర్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నానని స్పష్టంచేశారు. తాను ఎప్పటి నుండో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానన్నారు. ముక్కు మొహం తెలియని వారికి పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఎవరు ఎవరు సీట్లు అమ్ముకున్నారో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మరికొంతమంది పార్టీ కార్యకర్తలు పార్టీ సోషల్ మీడియా గ్రూప్లో పార్టీలో చాలా మందికి అవమానాలు, అన్యాయాలు జరిగాయని మెసేజ్లు పోస్ట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్లు నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి... పార్టీ కార్యాలయంలో ప్రెస్మీట్ ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. వీరితో పాటు స్టీరింగ్ కమిటీ కూడా నియమించడం జరిగిందన్నారు. పని చేసే వారిని ఈ రెండు నెలలపాటు గుర్తించి భవిష్యత్లో పెద్ద పెద్ద పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధిలుగా 11 మందిని, పార్లమెంట్ కన్వీనర్లుగా 17 మందిని, కో కన్వీనర్లుగా 108 మంది నియమించామన్నారు. ఈ సమావేశం అనంతరం కార్యాలయం ఆవరణలోనే వాగ్వాదం జరిగింది.