YSRCP vote bank politics in AP: నెల్లూరు గ్రామీణం కోడూరుపాడులో 19ఎకరాల పెన్నా పోరంబోకు భూమిని వైకాపా నాయకులు దర్జాగా కబ్జా చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్త రకం ఎత్తుగడకు తెరలేపారు. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా... దళితులు సాగు చేసుకుంటున్న భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చారు. హద్దు రాళ్లు వేశారు. ఈ వ్యవహారం జిల్లా అంతటా చర్చనీయాంశమైంది.
నెల్లూరు గ్రామీణ మండలం గుడిపల్లిపాడు రెవిన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 544, 545లో సుమారు 55 ఎకరాల పెన్నా పోరంబోకు భూములు ఉన్నాయి. పదేళ్ల కిందట కొంత భూమిని ఎస్సీలు సాగు చేసుకునేందుకు పంపిణీ చేశారు. 17ఏళ్లుగా రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు దౌర్జన్యంగా 19ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. హద్దు రాళ్లు వేశారు. గ్రావెల్‌తో చదును చేసి రోడ్లు వేశారు. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే ప్లాట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లని సమాధానం చెబుతున్నారు. సాగు భూమి కదా అని రైతులు ప్రశ్నిస్తే... సమాధానం లేదు. జిల్లా అధికారులకు ఈ అన్యాయంపై వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
నెల్లూరు నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆక్రమించి ప్లాట్లు వేసిన ప్రాంతంలో ఎకరం రెండు కోట్ల రూపాయల వరకు పలుకుతోంది. ఇందులో సాగు చేసుకుంటున్న దళితులకు డీఫాం పట్టాలు ఉన్నాయి. ఆర్ఎస్ఆర్‌లో పోరంబోకు అని ఉండటంతో ఎలాగైనా కాజేయాలనుకున్నారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులైన వి.లచ్చిరెడ్డి, చిరంజీవి, కోడూరు కమలాకర్‌రెడ్డి, లేబూరు పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్ వేశారు. పేదలకు పట్టాలు ఇస్తున్నామని చెప్పి కొందరికి చీటిలు కూడా పంపిణీ చేశారు. 19 ఎకరాల్లో ఒక్కొక్కటి 2 సెంట్ల చొప్పున 1400 ప్లాట్లు వేశారు. కొన్నింటిని పంపిణీ చేసి మిగతావి కాజేసేందుకు కుట్ర పన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులను కలిసినా సర్ధుకుపొమ్మంటున్నారని భూమి కలిగిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.