ఏపీ శాసన మండలిలో ఇతర పార్టీల నుంచి వచ్చే సభ్యులతో బలం పెరిగిన తర్వాత ప్రస్తుత మండలి ఛైర్మన్‌ను అవిశ్వాస తీర్మానంతో తొలగించాలని వ్యూహాం పన్నుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వైకాపా సభ్యుడిని ఛైర్మన్‌గా చేయాలని ఆశతో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్... ముఖ్యమంత్రి జగన్‌తో తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ నెల 27 న శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి రద్దుకు నిర్ణయం తీసుకోవాలా.. లేక మెజారిటీ వస్తే కొనసాగించటమా అన్న అంశంపై ప్రభుత్వం లోతుగా చర్చించినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును గట్టెక్కించుకోకపోతే మండలిని రద్దు చేయాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ఆత్మరక్షణలో పడినట్టు పార్టీ భావిస్తోంది. వారంతా తమవైపే మొగ్గుతారనే ప్రచారం జరుగుతోంది. అనుకున్నంత మంది ఎమ్మెల్సీలు మళ్లితే శాసనమండలి రద్దు ప్రతిపాదన వాయిదా వేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలతో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని, డబ్బు, పదవులు ఎర వేస్తున్నారని తెదేపా ఆరోపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక తెదేపా ఎమ్మెల్సీతో వైకాపా నేతలు మాట్లాడారని వార్తలు వస్తున్నాయి. పార్టీలోకి వస్తే రూ.5 కోట్ల నగదు, మండలిలో ప్రభుత్వ విప్ పదవి... వచ్చే ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఆయన కుటుంబానికి చెందిన వారికే అవకాశమిస్తామని చెప్పినట్టు తెదేపా వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనను తెదేపా ఎమ్మెల్సీ తిరస్కరించారని పేర్కొన్నాయి.