తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా తవ్వేస్తున్నారు.. దీన్ని ఏమనాలి..? లెక్కలేనితనమా..? - Vaikapa Irregularities in Visakha

YSRCP Robbery in Rushikonda: రెండు సెంట్ల ప్రభుత్వ భూమిని కలిపేసుకున్నారన్న ఆరోపణపై తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని.. ఏదో ఉగ్రవాదిని పట్టుకున్నట్టుగా అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి అరెస్ట్‌ చేశారు. తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇప్పటికిప్పుడు రోడ్డు విస్తరించాల్సిన అవసరం లేకపోయినా, ఆ పేరుతో సామాన్యుల ఇళ్ల ప్రహరీలను నిర్దాక్షిణ్యంగా కొట్టేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు అయ్యన్నపాత్రుడిపైనా, మరో ప్రతిపక్ష పార్టీ సమావేశానికి స్థలం ఇచ్చారన్న కారణంతో సామాన్యులపైనా ప్రతాపం చూపిన ప్రభుత్వం.. తాను మాత్రం విశాఖలోని రుషికొండపై ఆక్రమణలకు, ఉల్లంఘనలకు, ప్రకృతి హననానికి పాల్పడుతోంది. నిబంధనలకు పాతరేసి.. అక్రమంగా తవ్వేసింది. దీన్ని ఏమనాలి? లెక్కలేనితనమా? ఏం చేసినా..విశాఖ ప్రజలు భరిస్తారన్న తెంపరితనమా?.

YSRCP Robbery in Rushikonda
YSRCP Robbery in Rushikonda

By

Published : Nov 12, 2022, 9:53 AM IST

YSRCP Robbery in Rushikonda: రుషికొండపై రిసార్టుల పునరుద్ధరణ పేరుతో వైకాపా ప్రభుత్వం చేపట్టిన రహస్య ప్రాజెక్టులో అన్నీ లొసుగులే. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఇంతగా నిబంధనలు ఉల్లంఘించిన, ఆరోపణలు వచ్చిన ప్రాజెక్టు మరొకటి లేదు. తప్పుడు సమాచారంతో అనుమతులు పొందడం, పరిమితుల్ని దాటి తవ్వకాలు చేయడం, పర్యావరణ ప్రాజెక్టని చెప్పి.. దానికి ఏ మాత్రం పొంతనలేని ఆకృతులను ప్లాన్‌ కోసం సమర్పించడం, స్థానిక సంస్థలకు ఫీజు చెల్లించకపోవడం.

ఇలా అన్నీ ఉల్లంఘనలే.! రుషికొండపై జరిగిన అవకతవకలకు సంబంధించి లోతైన దర్యాప్తు జరిగితే.. కనీసం ఐదారుగురు ఐఏఎస్‌ అధికారులు, 15-20 మంది దిగువస్థాయి అధికారులు ఇరుక్కోవడం ఖాయం. అబద్ధాల పునాదుల మీద ఆ ప్రాజెక్టుని నిర్మిస్తూ.. ఇన్నాళ్లూ ఎలాంటి తప్పూ జరగలేదని బుకాయిస్తూ వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం ఈనెల 3న హైకోర్టుకి సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం జరిగిన తప్పును అంగీకరించింది.

3.86 ఎకరాల మేర మాత్రమే అదనంగా తవ్వామని కోర్టుకి చెప్పినా.. వాస్తవానికి అక్కడ మరో 20 ఎకరాలకుపైగా కొండను తవ్వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కోస్టల్‌ రీజియన్‌ జోన్‌- సీఆర్​జెడ్ నిబంధనల్నీ ప్రభుత్వం ఉల్లంఘించింది. రుషికొండపై ఎలాంటి అక్రమాలు జరిగాయో నిగ్గు తేల్చేందుకు.. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అధికారి నేతృత్వంలో నిపుణుల బృందం సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది.

క్షేత్రస్థాయి పరిశీలన:ఆ బృందం త్వరలో.. క్షేత్రస్థాయి పరిశీలనకు రాబోతోంది. రుషికొండపై జరిగిన ఉల్లంఘనలు, అక్రమాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇప్పటివరకు.. ఈ ప్రాజెక్టును అత్యంత రహస్యంగా ఉంచింది. ప్రతిపక్ష నాయకుల్ని, మీడియా ప్రతినిధుల్ని ఆ ఛాయలకు రాకుండా ఆంక్షలు విధించింది. రుషికొండపై రిసార్ట్‌ పునరుద్ధరణ పనుల కోసం ఏటీటీడీసీ.. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి 9.88 ఎకరాలకు అనుమతి తీసుకున్నారు.

ఈ పరిధిలో నిర్మాణలు చేపట్టాలి. అంతకుమించి.. ఏ పనులు చేపట్టినా మళ్లీ కొత్తగా అనుమతి పొందాలి. ఇదే సమయంలో నగర పరిధిలో ఎవరైనా ఏ చిన్న భవనం నిర్మించాలన్న జీవీఎంసీ అనుమతి తప్పనిసరి. ఇక్కడ మాత్రం ఎలాంటి అనుమతి తీసుకోకుండానే నిర్మాణ పనులు ప్రారంభించారు. అయినా జీవీఎంసీ అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు.

పునాదులు తీసి పైకప్పు వేసిన తర్వాత పత్రికల్లో రావడంతో అప్పుడు మేల్కొన్నారు. ఆ తర్వాత బిల్డింగ్ ప్లాన్ కోసం జీవీఎంసీకు ఏపీటీడీసీ దరఖాస్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. 9.88 ఎకరాలకు కేంద్ర అటవీ, పర్యావవణశాఖ నుంచి అనుమతిపొందిన రాష్ట్ర ప్రభుత్వం.. జీవీఎంసీ నుంచి మాత్రం భవన నిర్మాణాల ప్లాన్ కోసం 65 ఎకరాలకు అనుమతి కోరింది.

65 ఎకరాలకు ప్లాన్ మంజూరు:జీవీఎంసీ సైతం ఎంత విస్తీర్ణానికి సీఆర్​జెడ్ అనుమతి ఉందనేది పరిశీలించకుండానే భవిష్యత్‌ అవసరాల కోసమని చెప్పి మొత్తం 65 ఎకరాలకు ప్లాన్ మంజూరు చేసింది. జీవీఎంసీకు పెట్టిన ప్లాన్లో భవనాలకు సంబంధించిన ఆకృతులు పర్యాటక వసతులకు వీలుగా లేవు. దాదాపు అన్ని ఆకృతులు కార్యాలయాలను పోలి కనిపించాయి. అతిథ్యమని ప్లానులో పేర్కొన్న... అందుకు విరుద్ధంగా ఉండటంపైనా విమర్శలు వచ్చాయి.

జీవీఎంసీ అనుమతి ఇచ్చిన ప్లాన్లో, ఇక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టు పరిపాలన భవనాలంటూ తెలిపింది. వేంగి, గజపతి, కలింగ, విజయనగరం బ్లాక్స్‌ను గ్రౌండ్, మొదటి అంతస్తుతో నిర్మించేందుకు అనుమతించినట్లు అందులో తెలిపింది. ఏ నిర్మాణం చేపట్టాలన్నా అన్ని అనుమతి పత్రాలు సమర్పిస్తేనే.. జీవీఎంసీ ప్లాన్‌ మంజూరు చేస్తుంది. రుషికొండ ప్రాజెక్టుకి మాత్రం..ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రం సమర్పించే నాటికి పెండింగ్‌ పత్రాలు, ఫీజులు చెల్లిస్తే చాలంది.

65 ఎకరాల్లో భవనాల నిర్మాణ అనుమతులకు సంబంధించి 19 కోట్ల రూపాయల ఫీజుని ఐదేళ్లలో విడతల వారీగా చెల్లించేలా వెసులుబాటు ఇచ్చింది. రుషికొండపై ఏపీటీడీసీకి ఎంత భూమి ఉందన్న విషయంలోనూ.. స్పష్టత లేదు. మీ భూమి గ్రామ రికార్డు ప్రకారం సర్వే నంబరు 85.2 ఎకరాలు ఉన్నాయి. కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు సమర్పించిన వివరాల్లో 61 ఎకరాలుగా ఏపీటీడీసీ దస్త్రాల్లో 65 ఎకరాలుగా తెలిపారు.

9.88 ఎకరాల్లో ప్రాజెక్టుకి ఏపీటీడీసీ అనుమతి తీసుకున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో దీనికి రెండింతల తవ్వకాలు జరిగినట్లు కనిపిస్తోంది. తవ్విన మట్టిని అక్కడే ఉంచాలి. లేకుంటే మరేచోట నిల్వ చేసి మళ్లీ ఇక్కడి అవసరాలకు వినియోగించాలి. అందుకు విరుద్ధంగా గ్రావెల్‌ను బీచ్‌ రోడ్డులోని ఏపీటీడీసీకి చెందిన స్థలాలను చదును చేయడానికి వినియోగించారు. వేల టన్నుల మట్టిని బీచ్‌లో డంపు చేయడంతో అక్కడ సహజ వాతావరణం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

మాస్టర్‌ప్లాన్‌ నిబంధనల ప్రకారం:సీఆర్​జడ్​కు చేసిన దరఖాస్తులో కొత్త మాస్టర్‌ప్లాన్‌ నిబంధనల ప్రకారం అనుమతి కోరారు. కానీ అప్పటికి అది అమల్లోకి రాలేదు. గతంలో హైకోర్టు ఆదేశాలు, సీఆర్‌జడ్‌ నిబంధనల ప్రకారం ఆ ఏరియాలో భూగర్భ జలవనరులను వినియోగించకూడదు. ఇప్పటికే ఉన్న బోర్లనూ వాడరాదు. ప్రస్తుతం అక్కడ భూగర్భ జలాలను ఇష్టానుసారంగా వాడేస్తున్నారు. సీఆర్​జెడ్ పరిధిలో గుత్తేదారు లేబర్‌ క్యాంపు నిర్వహించడమూ నిబంధనలకు విరుద్ధమే.

పాత భవనాలున్న చోట మాత్రమే కొత్తవి నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు సాగుతున్నాయి. గతంలో నిర్మాణాలు లేనిచోట నాలుగు భవనాలను శరవేగంగా నిర్మిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న రుషికొండ పర్యాటక ప్రాజెక్టును ఎవరూ సందర్శించకుండా ఆంక్షలు విధించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇక్కడకు ఎవరూ వెళ్లకుండా ఏకంగా పోలీసు అవుట్ పోస్టు ఏర్పాటు చేశారు.

ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలంటే అనుమతి అవసరమంటున్నారు. గత నెల 28న తెలుగుదేశం పార్టీ రుషికొండ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించే కార్యక్రమనికి పిలుపునివ్వగా పోలీసులతో ఆ పార్టీ నేతల్ని దిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ ఆ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. బీచ్ రోడ్డులో తీవ్ర ఆంక్షలు విధించారు. 3నెలల కిందట సీపీఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తలపెట్టిన రుషికొండ పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంది.

ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ:దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వెంటనే అనుమతించాలని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థను ఆదేశించింది. చివరకు న్యాయస్థానం ఆదేశించిన 70 రోజుల తరువాత అధికారులకు ఆకస్మాత్తుగా గుర్తొచ్చినట్లు నారాయణకు అనుమతిస్తూ లేఖ రాశారు. ఆ సమయానికి ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు.

లేఖను చదివిన ఆయన ఇన్ని రోజుల తరువాత న్యాయస్థానం ఆదేశాలు పాటించారా? తాను విదేశాల్లో ఉన్నానన్న విషయాన్ని తెలుసుకొని ఈ లేఖను పంపినట్లుందని ప్రకటనలో తెలిపారు. రుషికొండపై చేపట్టింది పర్యాటక ప్రాజెక్టని ఏపీటీడీసీ బయటకు చెబుతున్నా, సీఎం క్యాంప్‌ కార్యాలయం కోసమే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయన్న అనుమానాలు మొదటి నుంచీ వ్యక్తమవుతున్నాయి.

ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే.. అది నిజమేనని రూఢీ అవుతోంది. కొద్ది రోజుల కిందట మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో మాట్లాడుతూ రుషికొండ వద్ద నిర్మిస్తున్న భవనాల్లో సీఎం ఉండకూడదా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కోసమే రుషికొండపై ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. అందులో తప్పేంటి.? రాష్ట ప్రజల ప్రతినిధిగా సీఎం ఎక్కడైనా ఉంటారంటూ మరో మంత్రి అమర్నాథ్‌ అక్టోబరు 27న విలేకరుల సమావేశంలో లోగుట్టు బయటపెట్టారు.

తప్పుడు సమాచారంతో అనుమతులు పరిమితుల్ని దాటి తవ్వకాలు పర్యావరణ ప్రాజెక్టని చెప్పి.. పొంతనలేని ఆకృతులుదర్యాప్తు జరిగితే ఐదారుగురు ఐఏఎస్‌లు ఇరుక్కోవడం ఖాయం. తప్పూ జరగలేదని బుకాయిస్తూ వచ్చిన ప్రభుత్వంహైకోర్టుకి సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం తప్పును అంగీకారం. 3.86 ఎకరాలు అదనంగా తవ్వినట్లు వివరణ. మరో 20 ఎకరాలకుపైగా తవ్వేశారన్న ఆరోపణలు.

కోస్టల్‌ రీజియన్‌ జోన్‌ నిబంధనల ఉల్లంఘనఅక్రమాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే రహస్యంకేంద్ర అటవీ పర్యావరణశాఖ నుంచి 9.88 ఎకరాలకు అనుమతి, అంతకుమించి చేపట్టినా మళ్లీ కొత్తగా అనుమతి పొందాలి. జీవీఎంసీ అనుమతి తీసుకోకుండానే పనులు ప్రారంభంబిల్డింగ్ ప్లాన్ కోసం దరఖాస్తుతో బయటపడిన రహస్యం, జీవీఎంసీ నుంచి 65 ఎకరాలకు అనుమతి.

రూ. 19 కోట్ల ఫీజుని విడతల వారీగా చెల్లించేలా వెసులుబాటుఏపీటీడీసీకి ఎంత భూమి ఉందన్న విషయంలోనూ స్పష్టత లేదు. 9.88 ఎకరాల్లో అనుమతి తీసుకున్నా క్షేత్రస్థాయిలో రెండింతల తవ్వకాలు ఇష్టానుసారంగా భూగర్భ జలాలు వాడకం, లేబర్‌ క్యాంపు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధంపాత భవనాలున్న చోటే కొత్తవి నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశంవిరుద్ధంగా సాగుతున్న నిర్మాణాలు. ప్రాజెక్టును ఎవరూ సందర్శించకుండా ఆంక్షలు సీఎం క్యాంప్‌ కార్యాలయం కోసమే నిర్మాణాలు జరుగుతున్నాయన్న అనుమానాలు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details