TDP VS YCP: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై అధికార పార్టీ నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. సంక్రాంతి మామూళ్ల కోసమే దత్త తండ్రి వద్దకు.. దత్త పుత్రుడు వెళ్లారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. వారి చీకటి బంధం ఇప్పటిది కాదని మరో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఎద్దేవా చేశారు. రాజకీయ ఎజెండా లేని పవన్.. జనసేనను ఎందుకు స్థాపించారో చెప్పాలని మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ రాజకీయ డ్రామాలు మానాలని మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. వారిరువురిని రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తారని మంత్రులు సీదిరి అప్పలరాజు, దాడిశెట్టి రాజా జోస్యం చెప్పారు .
జగన్ రెడ్డి ముఠాలో వణుకు పుట్టిస్తోంది:అధికార పార్టీ నేతల విమర్శలపై తెలుగుదేశం ఘాటుగా బదులిచ్చింది. పవన్, చంద్రబాబు భేటీ జగన్ రెడ్డి ముఠాలో వణుకు పుట్టిస్తోందని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. ఇరువురు కప్పు కాఫీ తాగితే.. వైసీపీ నేతలు మాత్రం మూడు చెరువుల నీళ్లు తాగారని సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చురకలంటించారు. బాబు, పవన్ కలిస్తే భయం లేదని చెప్పేందుకు ఇంత మంది మంత్రులు బయటికి వచ్చారంటే ఎవరు ఎక్కువగా భయపడుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
పచ్చి అబద్దాలు వల్లె వేస్తున్న మంత్రులు:పచ్చి అబద్దాలు వల్లె వేస్తున్న మంత్రులు.. 12 తీవ్రమైన కేసుల్లో ముద్దాయి, బెదిరించి కమీషన్లు లాక్కునే వారే ప్యాకేజీలిస్తారని ప్రతిదాడి చేశారు. తన అవలక్షణాలను ఎదుటివారిపైకి నెట్టడం జగన్ రెడ్డికి అలవాటైపోయిందని మండిపడ్డారు. కోడికత్తి, వివేకాపై గొడ్డలివేటును చంద్రబాబుపైకి నెట్టే ప్రయత్నం చేసి విఫలమైన జగన్ ముఠా.. చీకటి జీవో తెచ్చేందుకు అమాయకులను పొట్టనబెట్టుకుందని ఆరోపించారు. కందుకూరు, గుంటూరు ఘటనలను కూడా చంద్రబాబుకు ఆపాదించాలని జగన్ ముఠా కుట్ర చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీని శుభపరిణామంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభివర్ణించారు. ప్రతిపక్షాలు అన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న వైకాపాపై పోరాడాలని పిలుపునిచ్చారు.
" పవన్ కల్యాణ్ డబ్బులు సంపాదించటం బాగా నేర్చేశాడు. బీజేపీతో పొత్తులో ఉన్నామని అంటే చంద్రబాబు ఆటోమేటిక్‌గా రేటు పెంచుతాడు కదా. అందరం దీన్ని లాజీకల్గా అర్థం చేసుకోవాలి. ఎవరు ఉలిక్కిపడుతున్నారు. సింగిల్‌గానే పోటీ చేస్తామని చెప్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఉలిక్కిపడాల్సిన అవసరం మాకు లేదని.. ఎవరు ఎవరితో కలిసిన జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి అని నా అభిప్రాయం." -సీదిరి అప్పలరాజు, మంత్రి