YCP MLC CANDIDATE GIFTS TO TEACHERS : ఏపీలోని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసి ఒకరోజ అయినా గడవక ముందే.. వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తున్న అభ్యర్థి రామచంద్రారెడ్డి తరపున.. ఉమ్మడి కడప జిల్లాలో కానుక పంపిణీ మొదలైపోయింది. మార్చి 16వ తేదీ జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు లంచ్, టిఫిన్ బాక్సులను తాయిలాలుగా పంపిస్తున్నారు. కడప గర్ల్స్ హైస్కూల్‌లో గిఫ్ట్ బాక్సులు పంపిణీ చేస్తున్న వారిని సీపీఐ నాయకులు పట్టుకొని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
"కడపలో ఉపాధ్యాయులకు లంచ్, టిఫిన్ బాక్సులు పంచడానికి ఆటోలలో తీసుకొచ్చారు. వారి ప్రయత్నాన్ని మేము అడ్డుకుని ఆటో, ఆటో డ్రైవర్, లంచ్ బాక్సులను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాము. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లఘించిన వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ తరఫున డిమాండ్ చేస్తున్నాము"-వెంకట శివ, సీపీఐ నేత
కడప జిల్లా బద్వేల్, అన్నమయ్య జిల్లా నందలూరు సహా పలు చోట్ల పాఠశాలలో బాక్స్‌లు పంచేందుకు ప్రయత్నించగా.. ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహంతో ఉన్న ఉపాధ్యాయులు తీసుకునేందుకు తిరస్కరించారు. దీంతో బాక్సుల్ని అక్కడే వదిలేసి వెళ్లారు. కానుకల పంపిణీ విషయం సీఐటీయూ, డివైఎఫ్ఐ, ఉపాధ్యాయ సంఘాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. ఎన్నికల సిబ్బంది గిఫ్ట్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం సీఎం జగన్ అడ్డదారుల్లో ప్రయత్నించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.