తెలంగాణ

telangana

ETV Bharat / state

YSRCP Ministers: 'ప్రతిపక్షాలు ఏకమైనా.. వైకాపాను ఓడించలేవు' - ysrcp minister fire on opposition parties in bus tour

YSRCP Ministers: సమసమాజ నిర్మాణానికి జగన్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అన్నారు. సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర మూడోరోజున ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు. వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా జగన్‌..ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ నేతలకు పదవులుకట్టబెట్టారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాలని మంత్రులు సవాల్‌ చేశారు.

YSRCP Ministers
YSRCP Ministers

By

Published : May 29, 2022, 6:56 AM IST

'ప్రతిపక్షాలు ఏకమైనా.. వైకాపాను ఓడించలేవు'

YSRCP Ministers: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాలని సామాజిక న్యాయభేరి యాత్రలో ప్రసంగించిన పలువురు ఏపీ మంత్రులు సవాల్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో సింహం సింగిల్‌గానే వస్తుందని, తిరిగి అధికారంలోకి వచ్చేది జగన్‌మోహన్‌రెడ్డే అని వారు స్పష్టం చేశారు. శనివారం మూడోరోజు సామాజిక న్యాయభేరి యాత్ర తాడేపల్లిగూడెంలో ప్రారంభమై ఏలూరు, విజయవాడ, చిలకలూరిపేట మీదుగా రాత్రికి నరసరావుపేటకు చేరుకుంది. నరసరావుపేట సభలో పలువురు మంత్రులు మాట్లాడుతూ... జగన్‌ను ఓడించడానికి పవన్‌ కల్యాణ్‌, సీపీఐ, సీపీఎం, భాజపా.. ఇలా అందరితో పొత్తు పెట్టుకుంటానని చెప్పడం సిగ్గుగా లేదా అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మీరెన్ని పొత్తులు పెట్టుకున్నా.. పొర్లు దండాలు పెట్టినా... అధికారం కల్లేనని వ్యాఖ్యానించారు. రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగిస్తూ...'మహానాడు వేదికగా చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు మేం పంచుతున్నామంటున్నారు... ఆ పంచుడులో ఎక్కడైనా అవినీతి జరిగిందని చెప్పగలరా ? ఒక్క ఆరోపణ చేయలేకపోయారే ? ఎవరికి పంచుతున్నాం ? ఎంతో మందికి అన్నం పెడుతున్న అన్నదాతలకు, సమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతికి చేయూతనిస్తున్నాం. అది మీ కళ్లకు కనిపించడంలేదా' అని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం నడుస్తోందని.. సామాజిక విప్లవం వెల్లివిరుస్తోందని మంత్రి విడదల రజని చెప్పారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం లక్షా 36 వేల కోట్లు ఖర్చు పెట్టిందని లబ్ధిదారుల్లో 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని మంత్రి రజని అన్నారు.

ఎండకు అలసి సొలసి..:యాత్ర సందర్భంగా నిర్వహించిన పలు సభల్లో ప్రజలు ఎండలో రోడ్లపై నిల్చొనే నాయకుల ప్రసంగాలు వినాల్సి వచ్చింది. ఎండవేడిమి తట్టుకోలేక కొందరు వెనుదిరగడంతో చాలా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. తాడేపల్లిగూడెంలో ఏర్పాట్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కొందరు మంత్రులు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉంగుటూరు మండలం కైకరం దగ్గర టెంట్లు వేయకపోవడంతో సభకు హాజరైన వారంతా చెట్ల కింద నిరీక్షించారు. విజయవాడ బెంజిసర్కిల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా... 2 గంటల వరకు మంత్రుల జాడలేకపోవడంతో దాహానికి తాళలేక మజ్జిగ ప్యాకెట్ల కోసం జనం ఎగబడ్డారు. ఆలాగే భోజనం ప్యాకెట్లు ఇవ్వకపోవడంతో చాలామంది మహిళలు వెనుదిరిగారు. దీంతో మంత్రులు కేవలం 10 నిమిషాల్లోనే సభను ముగించాల్సి వచ్చింది. తాడేపల్లికి చెందిన మెప్మా సభ్యులను నగరపాలక అధికారులు ఉదయం 11.30 గంటలకల్లా పెద్ద సంఖ్యలో ఉండవల్లి కూడలికి తరలించారు. యాత్ర ఆలస్యమవుతుందని తెలియడంతో వారిని ఇంటర్‌ బోర్డు రాష్ట్ర కార్యాలయ సెల్లారులోకి తరలించారు. మెప్మా మహిళలు, వాలంటీర్లు ఎండకు తాళలేక అల్లాడిపోయారు. 2.30 గంటలకు బస్సు వచ్చింది. వీరంతా అక్కడికి వెళ్లేలోగానే అది వెళ్లిపోవడం గమనార్హం. చివరికి ఉసూరుమంటూ వారంతా అధికారులు, నాయకులను తిట్టుకుంటూ వెనుదిరిగారు.

  • పెదకాకాని వై జంక్షన్‌వద్ద జరిగిన బస్సు యాత్రకు గుంటూరు నగరపాలక సంస్థ నుంచి పారిశుద్ధ్య సిబ్బంది, డ్వాక్రా మహిళలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను తరలించారు. అక్కడే సిబ్బందికి హాజరును నిర్ధారించే ఐరిష్‌ను సూపర్‌వైజర్‌ నమోదు చేయడం గమనార్హం.
  • పెదకాకానిలో సభకు వస్తే ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, చేతి కర్రలు ఇస్తామని వైకాపా నాయకులు చెప్పడంతో ఎండను సైతం లెక్క చేయకుండా గుంటూరు నగరం, తాడికొండ నియోజక వర్గాల నుంచి దివ్యాంగులు సభకు వచ్చారు. అందజేసిన వాటిల్లో కొన్ని ట్రైసైకిళ్లు తుప్పు పట్టి ఉన్నాయి. టైర్లలో గాలి లేదు. వాటిని తీసుకున్న వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
  • ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం జి.ఉమ్మడివరంలో బస్సు యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన యువతుల నృత్య ప్రదర్శన చర్చనీయాంశమైంది. సమయాభావంతో సభను రద్దు చేశారు.

జనసేన నాయకుల నిర్బంధం:జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు నిర్బంధం అమలు చేశారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర నేపథ్యంలో నల్లజెండాలతో నిరసన తెలపాలని ఆ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో గత రాత్రి నుంచి పార్టీ ముఖ్య కార్యకర్తలపై పోలీసులు దృష్టి సారించారు. శనివారం ఉదయం నియోజకవర్గ బాధ్యుడు సయ్యద్‌ జిలానీని గృహ నిర్బంధం చేశారు.

ఇవాళ నంద్యాల నుంచి ప్రారంభం కానున్న మంత్రుల బస్సు యాత్ర కర్నూలు, డోన్‌ మీదుగా అనంతపురం చేరుకోనుంది. సాయంత్రం 4 గంటలకు.. అనంతపురంలోని జూనియర్ కళాశాల మైదానంలో సామాజిక న్యాయభేరి సభ నిర్వహించనున్నారు.

ఇవీ చూడండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details