Kodi Pandalu in AP : సంక్రాంతి పండుగకు కోడిపందేల బరులు సిద్ధమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం పైకి అనుమతులు లేవని చెబుతున్నా అధికార పార్టీ వారే అత్యధికంగా బరులు ఏర్పాటు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వైసీపీ సీనియర్ నేతే స్వయంగా పందేల్లో పాల్గొంటున్నారు. కృష్ణా, పశ్చిమగోదవారి జిల్లాల సరిహద్దులోని లోసరిలోనూ.. అధికార పార్టీ నేతలు బరులు గీస్తున్నారు. వీరవాసరం మండలంలోని కొణితివాడలో పందేల నిర్వహణకు వైసీపీలోని రెండు వర్గాలు పోటీపడి రోడ్డెక్కడం పరిస్థితికి అద్దంపడుతోంది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం మండలంలోని పెదఅమిరం, కాళ్ల పరిధిలోని కాళ్లకూరు, సీసలి, జువ్వలపాలెం, ఉండి మండలం యండగండి, మహదేవపట్నం, ఆకివీడు పరిధిలోని దుంపగడప, గణపవరం మండలంలోని అర్ధవరంతోపాటు.. తాడేపల్లిగూడెం, చింతలపూడి, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, కలిదిండి, నిడదవోలు, కొవ్వూరులోనూ బరులు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, కాకినాడ గ్రామీణం, కరప, తాళ్లరేవు, రామచంద్రపురం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, అల్లవరం, అమలాపురం, రాజోలు, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, అంబాజీపేట, అయినవిల్లి, కాట్రేనికోన మండలాల్లో పలుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకుల కనుసన్నల్లో పందేలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బరుల పక్కనే పేకాట, గుండాటల నిర్వహణకూ సిద్ధం చేస్తున్నారు. గతేడాది కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో రాష్ట్రస్థాయి బరి నిర్వహించి.. కోట్ల రూపాయల జూదం నిర్వహించారు.
అధికార పక్షమే బరి ఏర్పాటు : ప్రతిపక్షాలవారు, తమకు కప్పం కట్టని పందేల నిర్వాహకులు బరులు ఏర్పాటు చేయకుండా.. అధికార పార్టీ నేతలు పోలీసులతో ముందే కట్టడి చేయిస్తున్నారు. గతంలో ఆకివీడు మండలం దుంపగడప బరిని తెలుగుదేశం నాయకులే నిర్వహించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వారు బరి వేయకుండా.. అప్పటి మంత్రి రంగనాథరాజు తెర వెనుక ఉండి అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈ మూడేళ్లలో కోడిపందేల నిర్వహిస్తున్న వారిపై .. 3 వేల 27 కేసులు నమోదు చేసి.. 6 వేల 455 మందిని అరెస్ట్ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ మూడేళ్లలో 17 వందల 37 కేసులు నమోదు చేసి.. 5 వేల 403 మందిని అరెస్ట్ చేశారు. రెండు చోట్లా కలిపి కోటి రూపాయలకు పైగా నగదు, దాదాపు 8 వేల కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ప్రతిపక్షాలవారివి, అధికార పార్టీ నేతలకు కప్పం కట్టని నిర్వాహకులవేనన్న ఆరోపణలున్నాయి.