రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం.. జులై 8న పార్టీని ప్రకటించనున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడించారు. తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో కార్యకర్తలే కీలకమని.. వారికే పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో అన్ని జిల్లాల ముఖ్య నేతలతో నూతన పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ సంబంధించిన పలు అంశాలపై కార్యకర్తలు, నేతలకు షర్మిల పలు కీలక సూచనలు చేశారు.
తెలంగాణ ప్రాంతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన ఫలాలు అందని ఇళ్లు లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా తమ పార్టీ అభివృద్ధి, సంక్షేమ కోసం పాటుపడుతుందని తెలిపారు. ప్రజల ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా పార్టీ ఉండాలని చెప్పారు. పార్టీ ఏర్పాటుకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నందున ఆలోగా కార్యకర్తలందరూ ప్రతి గడపకు వెళ్లి ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇంకా అందనిది.. విద్యార్థుల ఆకాంక్షలు, రైతుల అవసరాలు, నిరుద్యోగులు ఏం అనుకుంటున్నారు.. ఇలా ప్రతి వర్గాన్ని కలవాలని షర్మిల నిర్దేశించారు.