తెలంగాణ

telangana

ETV Bharat / state

Sharmila Comments on YSR : కేసీఆర్‌లా.. వైఎస్‌ ఒక్కరి వద్దే కమీషన్లు తీసుకోలేదు - Sharmila Comments

Sharmila Comments on YSR : తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డిపై వైతెపా అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్​లా.. వైఎస్​ ఒక్కరి వద్దే కమీషన్లు తీసుకోలేదని ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Sharmila Comments
కేసీఆర్‌లా.. వైఎస్‌ ఒక్కరి వద్దే కమీషన్లు తీసుకోలేదు: షర్మిల

By

Published : Jul 26, 2022, 10:11 AM IST

Sharmila Comments on YSR : ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లా ఒకే గుత్తేదారుకే ప్రాజెక్టులు ఇవ్వలేదు.. ఒకరి దగ్గరే కమీషన్లు తీసుకోలేదు’’ అని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మేఘా కృష్ణారెడ్డి దోచుకున్నారని ఆరోపించారు. రూ.70 వేల కోట్ల నల్లధనం ఆయన వద్ద ఉందని.. దానికి సంబంధించి రూ.12 వేల కోట్ల జీఎస్టీ ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుందని స్వయంగా జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ పేర్కొన్నారని అన్నారు. ఎలాంటి విచారణ లేకుండా అన్ని ప్రాజెక్టులు ఆయన సంస్థకే ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు భాగస్వామ్యం లేకపోతే అన్ని ప్రాజెక్టులు ఆయనకే ఎందుకు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు.

‘‘భద్రాచలంలో వరదలకు ముమ్మాటికీ సీఎం కేసీఆరే కారణం. విదేశీ కుట్రతోనే మేఘాలు బద్దలయ్యాయని ఆయన తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేశారు. మరో మంత్రి పక్క రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరంతోనే ముంపునకు గురైందని పేర్కొన్నారు. వరదలకు ముందు ఆ ప్రాజెక్టు కనిపించలేదా. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి పిలిపించుకుని మిఠాయిలు తినిపించినప్పుడు పోలవరం గురించి ఎందుకు మాట్లాడుకోలేదు. మీకు ఆ రాష్ట్ర సీఎం స్నేహితుడైనప్పుడు ఎందుకు సమస్యను పరిష్కరించలేదు. రాజకీయ లబ్ధికి కాకపోతే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ ఇప్పటికే ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించి ఇప్పటికీ ఇవ్వలేదు. మరోవైపు కాళేశ్వరంలో రక్షణ గోడ కూలి బాహుబలి మోటార్లు మునిగాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లేదు. గుత్తేదారుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టు పనిని ఒకే గుత్తేదారుకు ఇస్తున్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రావాళ్లు ప్రాజెక్టులు తీసుకుంటున్నారన్న కేసీఆర్‌.. ఇప్పుడు కాంట్రాక్టులు వాళ్లకే ఎందుకు ఇస్తున్నారు. వచ్చే నెల 3 లేదా 4 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తా.’’ -వైఎస్​ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

ఇదిలా ఉండగా.. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో షర్మిల పొరపాటున కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ ఆమె పీఆర్‌వో ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వైఎస్‌ ఎవరి దగ్గరా కమీషన్లు తీసుకోలేదు’ అని చెప్పబోయి.. అలా అన్నారంటూ వివరణ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details