YS Sharmila fires on CM KCR on Palamuru project issue : వైఎస్సార్ జలయజ్ఞం కింద వేసిన పునాదులే.. నేడు కేసీఆర్ చెబుతున్న 20 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై తన దైన శైలిలో విమర్శలు చేసిన ఆమె.. పాలమూరు కన్నీళ్లను చూసి సాగునీళ్లు ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ అని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి మోయని ముఖ్యమంత్రి కేసీఆర్.. తానే జలకళ తెచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
Palamuru project issue : ఎన్నికల వేళ మాయ మాటలు చెప్పే కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా ..? అంటూ సవాల్ విసిరారు. బీడు భూముల్లో కృష్ణా జలాలు పారించిన ఘనత ఎవరిదో చర్చకు రాగలరా..? అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా గత ప్రభుత్వ హయంలో తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టుల నిర్మాణాలు గురించి ప్రస్తావించారు. కల్వకుర్తి ద్వారా 4 లక్షల ఎకరాలు, బీమా ప్రాజెక్టు కింద 2 లక్షల ఎకరాలకు, నెట్టెంపాడుతో 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 60 వేల ఎకరాలు, గట్టు, తుమ్మిల్ల, సంగంబండ ఇలా ఎన్నో ప్రాజెక్టులు వైఎస్సార్ హయంలో నిర్మించారని చెప్పుకొచ్చారు.
Palamuru project political controversy : బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎకరాకు సాగు నీరు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో మైగ్రేషన్ వద్దని ఇరిగేషన్ చేస్తే.. నేడు ఇరిగేషన్ పక్కన పెట్టి మైగ్రేషన్ వైపే తిరిగి మల్లేలా కేసీఆర్ పాలన ఉందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు అయిన వలసలు ఆగడం లేదని ఆరోపించారు. 15 లక్షల మంది పాలమూరు యువతకు ముంబాయి, దుబాయ్‌ల్లో కష్టాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట,సిరిసిల్ల, గజ్వేల్ మీద ఉన్న ప్రేమ పాలమూరు మీద ఎందుకు ఉండటం లేదని షర్మిల ప్రశ్నించారు.
త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభిస్తాం : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం పూర్తియితే రంగారెడ్డి, నల్గొండతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు నీటి కష్టాలు తీరనున్నాయి. దీని నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ సైతం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రాజెక్టు పనులు వేగవంతం జరిగేలా చూడాలని అధికారలను ఆదేశిస్తున్నారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం సచివాలయంలో జరిగిన మొదటి సమీక్షలో ఈ ప్రాజెక్టు పనులపైనే అధికారులను ఆరా తీశారు. ఈనెల మొదటి వారంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించిన సీఎం ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. మరోవైపు మంత్రులు హరీశ్, కేటీఆర్ సైతం పాలమూరు ప్రాజెక్టును మరో కొద్ది నెలల్లో ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: