తెలంగాణ

telangana

ETV Bharat / state

విపక్షాల ఉమ్మడి కూటమికి అధ్యక్షత వహించండి.. కోదండరామ్​తో షర్మిల - తమ్మినేని వీరభద్రంతో షర్మిల భేటీ

Sharmila Meets Kodandaram : రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడాలంటూ ఇటీవల విపక్ష పార్టీలకు లేఖలు రాసిన వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.. తాజాగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలతో భేటీ అయ్యారు. నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు కలిసి రావాలని కోరారు.

Sharmila Meets Kodandaram
Sharmila Meets Kodandaram

By

Published : Apr 4, 2023, 3:29 PM IST

Sharmila Meets Kodandaram : వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల టీజేఎస్ అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్​తో భేటీ అయ్యారు. నాంపల్లిలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ఆయనతో సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు టీ-సేవ్‌ ఫోరం అధ్యక్షుడిగా ఉండాలని కోదండరామ్​ను షర్మిల కోరారు. అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని.. ఒకే వేదిక మీదకు వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు. కలిసి కొట్లాడకపోతే నిరుద్యోగులకు న్యాయం జరగదన్నారు. షర్మిల ప్రతిపాదనలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్ వివరించారు. కోదండరామ్​తో భేటీ అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోనూ షర్మిల భేటీ అయ్యారు. ఎంబీ భవన్‌లో తమ్మినేనిని కలిసిన షర్మిల.. ప్రజా ఆందోళనల్లో విపక్షాలన్నీ కలిసి పోరాడాలని కోరారు.

రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడదామంటూ వైఎస్ షర్మిల ఇటీవల విపక్ష నేతలకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. జెండాలు.. అజెండాలు వేరైనా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి టీ-సేవ్ (తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ వేకెన్సీ అండ్ ఎంప్లాయిమెంట్) పేరుతో నిరుద్యోగులకు మద్దతుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, తెజస, టీటీడీపీ పార్టీలకు లేఖలు రాశారు.

ఎవరి నాయకత్వంలో అయినా ఓకే..: నిరుద్యోగ సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేయాలని.. దీనికి ఆచార్య కోదండరాం, లేదా మరొకరు నాయకత్వం వహించినా తనకు అభ్యంతరం లేదని షర్మిల పేర్కొన్నారు. ఈ విషయమై ఈ నెల 10న విపక్ష పార్టీలన్నీ ఓచోట సమావేశమై చర్చించుకోవాలని సూచించారు. విద్యార్థుల కోసం ప్రతిపక్షాలన్నీ ఒక్కటై పోరాటం చేయాలని సూచించారు. ప్రతిపక్షాలన్నీ కలసి కట్టుగా పోరాటం చేస్తే దేశమంతా చూస్తుందని అన్నారు. ఐఎంఐఏ రిపోర్ట్ ప్రకారం.. దేశం మొత్తం మీద ఉన్న నిరుద్యోగంతో పోలిస్తే.. రాష్ట్రంలో 2 శాతం అధికంగా నిరుద్యోగం ఉందని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్..​ 33 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్స్ ఇచ్చారని ఆరోపించారు. అందులో 8 వేలకు మాత్రమే పరీక్షలు జరగగా.. అందులో లీకులతో విఫలమయ్యారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి.. నిరుద్యోగులు, విద్యార్థుల కోసం పోరాడాలని షర్మిల పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇటీవల బండి సంజయ్, రేవంత్​రెడ్డిలకు ఫోన్ చేసి మాట్లాడిన షర్మిల.. నేడు కోదండరాంతో భేటీ అయ్యారు. అయితే పార్టీ నేతలతో చర్చించిన అనంతరం తన నిర్ణయం వెల్లడిస్తానని కోదండరాం షర్మిలతో చెప్పారు.

ఇవీ చూడండి..

విద్యార్థుల కోసం ప్రతిపక్షాలన్నీ ఒక్కటై పోరాటం చేయాలి

కలిసి నడుద్దాం.. నిలిచి పోరాడదామంటూ షర్మిల లేఖ.. విపక్షాలు ఓకే చెప్పేనా..?

ABOUT THE AUTHOR

...view details