YS Sharmila letter to opposition partys: తెలంగాణలో ఉన్న విపక్ష పార్టీ నేతలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం ఉమ్మడి పోరాటం చేద్దామని ఆమె ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. అఖిలపక్షంగా దిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామని తెలిపారు. రాష్ట్రంలో అప్రకటిత, అత్యయిక పరిస్థితులు ఉండటంతో పాటుగా ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు, అరెస్టులు, రాళ్ల దాడులు చేయిస్తున్నారని షర్మిల మండిపడ్డారు.
"ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్యను మీతో చర్చించాలని అనుకుంటున్నట్లు" షర్మిల ఆ లేఖలో పేర్కొన్నారు. అధికారపక్ష దాష్టికాలకు ముగింపు చెప్పాల్సిన సమయం అసన్నమైందన్నారు. అందుకోసం విపక్షాలు ఒక్కటై ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాక్షసత్వంతో పోలీసులను పురిగొల్పి, వారిపై ఒత్తిడి తెచ్చి మరీ థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తూ ఆసుపత్రి పాలు చేస్తున్నారని మండిపడ్డారు.
President rule in Telangana: ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు, ఆందోళనలకు అనుమతులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల వద్దకు వెళ్లేందుకు వీల్లేకుండా అడ్డుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తనను కారులో ఉండగానే టోయింగ్ చేయడం దారుణమని అన్నారు. ఆంధ్రాపాలకుల హయాంలోనూ ఈ ఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
మన పోరు కేక నియంత కేసీఆర్ పాలనకు చరమగీతంలా మారాలని ప్రతిపక్ష నేతలకు లేఖలో వివరించారు. దిల్లీలో రాష్ట్రపతిని కలిసి కేసీఆర్ సర్కారును బర్తరఫ్ చేయాల్సిన అవసరాన్ని తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అందుకు మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నట్లు షర్మిల ఆ లేఖలో వివరించారు. ఆ లేఖలో ప్రతిపక్ష పార్టీ నాయకులైన బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కోదండరామ్, కాసాని జ్ఞానేశ్వర్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, అసదుద్దీన్ ఒవైసీ, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంభశివరావు, మందకృష్ణ మాదిగ, ఎన్. శంకర్ గౌడ్‌ల పేర్లు ప్రస్తావించారు.