YS Sharmila Hunger Strike at Lotus Pond Hyderabad :తనను చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. పోలీసులు కేసీఆర్‌కు తొత్తుల్లా పనిచేయడం మానుకోవాలని హితవు పలికారు. గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటనకు సిద్ధమైన వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసుల చర్యలకు నిరసనగా సాయంత్రం వరకు నిరాహార దీక్ష(Hunger Strike) చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు పోలీసులకు, షర్మిలకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కేసీఆర్‌పై విమర్శలు చేశారు. మరోవైపు ఎక్స్(Twitter)లో కూడా ప్రభుత్వ నియంత పోకడలను ఎండగట్టారు.
YS Sharmila House Arrest Hyderabad : శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలి మమ్మల్ని అడ్డుకుంటున్నారని వైఎస్ షర్మిల పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేనికోసం అనుమతి తీసుకోవాలి.. ప్రజలను కలవడానికి కూడా అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. గజ్వేల్‌లో ఎవరినైనా అరెస్టు చేశారా అని నిలదీశారు. అక్కడ నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్(BRS) నేతలను ఎందుకు అరెస్టు చేయడం లేదని పోలీసులను ప్రశ్నించారు.
"దళితబంధు(Dalit Bandhu) అమలు తీరుపై తమ తరఫున వచ్చి పోరాడమని తీగుల్ ప్రజలు లేఖ రాశారు. అందుకే అక్కడ పరిస్థితులను తెలుసుకోవడానికి వెళుతున్నాను. అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే నన్ను గృహనిర్బంధం చేశారు. దాడులు చేయడానికి మేము తీగుల్ వెళ్లడం లేదు. ప్రజలు తరఫున పోరాటం చేయడానికి వెళుతున్నాం. తమను అడుగుపెట్టనివ్వమన్న బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారా?. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న తమను అరెస్టు చేస్తారానని"- వైఎస్ షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు
YS Sharmila Fires On BRS : ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని వైఎస్ షర్మిల కుండబద్దలు కొట్టి చెప్పారు. ఎలాగైనా సరే గజ్వేల్ వెళ్లి తీరుతానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గజ్వేల్‌కు వెళ్లడానికి అనుమతి లేదని తేల్చి చెప్పగా.. కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుకు నిరసనగా లోటస్‌పాండ్‌లోని నివాసంలో వైఎస్ షర్మిల నిరాహార దీక్షను చేపట్టారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.