తెలంగాణ

telangana

ETV Bharat / state

అవినీతిని ఎత్తిచూపితే వ్యక్తిగతంగా దూషిస్తున్నారు: షర్మిల

YS Sharmila got bail: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై, హైదరాబాద్‌లో పోలీసులు నమోదు చేసిన కేసులో ఆమెకు బెయిల్‌ లభించింది. నర్సంపేట ఘటనతో పార్టీ శ్రేణులతో కలిసి ప్రగతిభవన్‌ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు ఆమెను అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. షర్మిల డ్రైవింగ్‌ చేస్తుండగానే, టోయింగ్ వాహనంతో కారును తీసుకువెళ్లిన పోలీసులు.. ఆమెపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందునే తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.

YS Sharmila got bail
YS Sharmila got bail

By

Published : Nov 30, 2022, 8:13 AM IST

అవినీతిని ఎత్తిచూపితే వ్యక్తిగతంగా దూషిస్తున్నారు: షర్మిల

YS Sharmila got bail: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలో వరంగల్‌ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకున్న ఘటనలతో నిన్నంతా నిరసనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలో టీఆర్​ఎస్ శ్రేణులు ధ్వంసం చేసిన వాహనాలతో ప్రగతిభవన్‌కు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నించగా, పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

రాజ్‌భవన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ స్తంభించటంతో, కారు డ్రైవింగ్ సీట్లో షర్మిల కూర్చొని ఉండగానే టోయింగ్ వాహనంతో ఆమె కారును ఎస్​ఆర్​నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. షర్మిలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని, శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అరెస్ట్ చేశారని.. ఆమె తరపు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని, పోలీస్‌ అధికారులపై దురుసుగా ప్రవర్తించారని, అధికారుల వస్తువులను సైతం లాక్కొనే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. పాదయాత్ర విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని, షర్మిలకు సూచించింది. టీఆర్​ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకే తనను అరెస్ట్ చేయించారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని, ప్రజల పక్షాన నిలబడటం తప్పా అని ప్రశ్నించారు. అరెస్టు చేశాక.. తమ కార్యకర్తలను కొట్టాల్సిన అవసరం పోలీసులకు ఏముందన్న షర్మిల.. గురువారం నుంచి పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టంచేశారు. అంతకుముందు తన కుమార్తెను పరామర్శించేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుపడుతున్నారంటూ వైఎస్. విజయమ్మ లోటస్‌పాండ్‌లో నిరాహార దీక్షకు దిగారు.

షర్మిలను అరెస్టు చేశారని తెలియడంతో ఠాణాకు వెళ్లేందుకు ఆమె సిద్ధమవగా శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. షర్మిలకు బెయిలు మంజూరు కావడంతో విజయమ్మ దీక్షను విరమించారు. వైఎస్. షర్మిల అరెస్టు పరిణామాలపైన గవర్నర్‌ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన గవర్నర్.. కారు లోపల ఉన్నప్పుడు క్రేన్‌తో లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయన్నారు. ఏ రాజకీయ నేపథ్యం, భావజాలం అయినప్పటికీ మహిళలను గౌరవప్రదంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details