YS Sharmila comments on CM KCR: పాదయాత్రకు సంబంధించి తమ చేతిలో హైకోర్టు ఆర్డర్ ఉన్నా.. పోలీసులు అనుమతి ఇవ్వకుండా నోటీసులు ఇచ్చారని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి.. ఓర్వలేకే ఆపాలని చూస్తున్నారని షర్మిల విమర్శించారు. లోటస్ పాండ్ లోని వైఎస్సార్టీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడారు. టీఆర్ఎస్ అవినీతిని, వైఫల్యాలను ఎత్తిచూపితే తట్టుకోలేకే.. దాడులకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. వ్యక్తిగత దూషణలకు ఎప్పుడూ దిగలేదని షర్మిల తెగేసి చెప్పారు. ఒక మహిళను పట్టుకొని మరదలు, వ్రతాలు అనడం వ్యక్తిగత దూషణ కాదా.. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు చేస్తుంది ఏంటి అని ప్రశ్నించారు.
"మా పాదయాత్రే కేసీఆర్ పాలనకు అంతిమ యాత్ర అని కేసీఆర్కు స్పష్టంగా అర్థమైంది. అందుకే నా పాదయాత్రను ఎలాగైన ఆపాలని కంకణం కట్టుకున్నారు కేసీఆర్. పోలీసుల భుజాన తుపాకి పెట్టి మా పాదయాత్రను ఆపివేయాలని చూస్తున్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు చెప్పుతున్నా కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ మాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు." -వైఎస్ షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు