విద్యార్థులు ముందుండి పోరాటం చేస్తేనే తెలంగాణ సాధ్యమైందని వైఎస్ షర్మిల అన్నారు. విద్యార్థుల బలిదానాల మీదనే ఇప్పటి పాలకులు అధికారంలోకి వచ్చారని ఆమె పేర్కొన్నారు. కాకతీయ యూనివర్శిటీలో జరిగిన ఘటన గురించి తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రశ్నిస్తే.. వాళ్లమీద దాడులు జరపడం చాలా బాధాకరమని అన్నారు. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థులకు, జర్నలిస్టుకు ఆమె సంఘీభావం తెలియజేశారు. లోటస్ పాండ్లో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
మార్చి 10-2011 సరిగ్గా ఇదే రోజున ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి అద్బుతంగా చాటి చెప్పింది మిలియన్ మార్చ్.. అని ఆమె గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సిద్దాంతకర్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ను స్మరించుకోవడం మన బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఎంతో మంది ఉద్యమకారులను, కళాకారులను అందించిన జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా అని ఆమె స్పష్టం చేశారు.