Non-IT sectors: ఐటీకి దీటుగా ఐటీయేతర రంగాలు ఉద్యోగాల కల్పనలో దూసుకుపోతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత నియామకాల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఐటీకి దీటుగా ఇతర రంగాలు విస్తరిస్తుండటంతో కొలువులకు ప్రాధాన్యం పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 10-20 శాతం పెరుగుదలతో వేతనాలూ లభిస్తున్నాయి.
ఫార్మా, బీమా రంగాలకు ప్రాధాన్యం..
కరోనా ప్రభావం తర్వాత ఫార్మా, బీమా రంగాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా బయోటెక్నాలజీ, ఫార్మసీ, బయోఫిజిక్స్, మైక్రో బయోలజీ రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆరోగ్య రక్షణ దృష్ట్యా బీమా రంగానికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల నౌకరీ సంస్థ నిర్వహించిన సర్వేలో ఫిబ్రవరిలో బీమా రంగంలో ఉద్యోగాల కల్పన రేటు 74 శాతం పెరిగినట్లు వెల్లడైంది. రిటైల్ రంగంలో 64 శాతం, ఐటీ, ఆతిథ్య/పర్యాటక రంగాల్లో 41 శాతం, బ్యాంకింగ్/ఫైనాన్స్‌లో 35 శాతం, ఫార్మా విభాగంలో 34 శాతం వృద్ధి రేటు ఉన్నట్లు తేలింది. ‘‘మేం నిర్వహించిన ఉద్యోగ మేళాకు 250 కంపెనీలను ఆహ్వానించాం. 3 వేలకు పైగా ఆఫర్ లెటర్లు దక్కాయి. ఫార్మా రంగం బాగా పుంజుకుంది’’ అని సాల్వెక్స్ కంపెనీ సీఈవో పి.లక్ష్మీరాయ్ వివరించారు.
వేతనాల్లోనూ వ్యత్యాసం..
ఏదైనా ఉద్యోగానికి అనుభవం కీలకం. ఐటీ రంగానికి ఎంపికయ్యే అభ్యర్థుల విషయంలో అదనపు నైపుణ్యాలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ఐటీయేతర రంగాల్లో ఆ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. జేఎన్‌టీయూలో టాస్క్, సాల్వెక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో అనుభవం లేకపోయినా.. నెలకు రూ.15-18 వేలు ప్రారంభ వేతనంతో ఆఫర్ లెటర్లను కంపెనీలు ప్రకటించాయి. వేతనానికి తోడు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. వసతి, ఈఎస్‌ఐ, పీఎఫ్, రవాణా సౌకర్యం, ఆహారంలో రాయితీ వంటివి అందిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి.