పురపోరులో యువతరం ప్రత్యేక ఆకర్షణ
పురపోరులో కీలకమైన ప్రచార పర్వానికి తెరలేచింది. గెలుపే లక్ష్యంగా...సర్వశక్తులూ ఒడ్డేందుకు... నాయకులు తమ బలాలను బలగాలనూ తీసుకొని గల్లీల్లో, వాడల్లో, కాలనీల్లో తిరిగేందుకు సన్నద్ధమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే..ఈ పోరులో ప్రత్యేకంగా కనిపిస్తోంది, వినిపిస్తోంది...యువత. ప్రజాప్రతినిధులుగా నిలబడి సమస్యల్ని తామే పరిష్కరించుకుంటామంటూ యువత కదన రంగంలోకి అడుగుపెట్టింది. పాలకులు ఎన్నో ఏళ్లుగా పట్టించుకోకుండా గాలికి వదిలేసిన ప్రజా సమస్యలను తాము వేలెత్తిచూపుతామంటోంది. ప్రజల తరుపున ప్రతినిధులుగా నిలబడుతూ... నిలబెడుతూ ప్రత్యేకత చాటుకుంటోంది యువతరం.
రాజకీయాల్లో రాణించేందుకు యువత ఆసక్తి
ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఎన్నికలపై యువత ఆసక్తి కనబరుస్తోంది. ప్రజాసేవ కోసం రాజకీయాలను వేదిక చేసుకుంటోంది. తాజాగా జరగనున్న పురపాలిక ఎన్నికల్లో వారే అత్యధికంగా నామపత్రాలు దాఖలు చేశారు. పుర బరిలో నిలవడమే కాకుండా...గెలిచి తీరుతామంటున్నారు. ప్రజల కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకంగా వ్యవహరిస్తామని చాటిచెబుతున్నారు. సమర్థమైన రాజకీయాలకు ఆలంబనగా నిలవాలనే సదాశయంతో దాదాపు అన్ని జిల్లాల్లో యువకులు రాజకీయాల్లో రాణించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.