దిశ అత్యంత కఠినమైన పరిస్థితుల్లో నలుగురు కామాంధుల చేతికి చిక్కి బలైపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దీనిపై సామాజిక మాధ్యమాల్లో దిశకు అందరూ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ జస్టిస్ ఫర్ దిశ అని పోస్టులు పెడుతుంటే... కొందరు పోకిరీలు మాత్రం ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. వాట్సప్, ఫేస్ బుక్‌లలో అసహ్యంగా కామెంట్లు పెట్టడమే కాక.. అమె ప్రవర్తనపై కూడా అనుచిత కామెంట్లు చేస్తున్నారు. దీనితో వారిపై నెటిజెన్లు దుమ్మెత్తి పోశారు.
ఆ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు.. అసభ్య కామెంట్లు చేసిన ఫేస్ బుక్ 'స్మైలీ నానీ గ్యాంగ్' గ్రూప్‌లో ఉన్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. మంగళవారం నిజామాబాద్‌కు చెందిన శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బుధవారం గుంటూరు జిల్లా అమరావతికి చెందిన ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్ నానిని కూడా అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. మరో వైపు రాయదుర్గంలోని ఓ మహిళ వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదుతో అనిల్ కుమార్ అంబాల అనే వ్యక్తిని సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.