ఏదైనా సొంత వ్యాపారంతో బతుకుబండి లాగాలని కొందరు.. కనీసం రూ. 50 వేలు మంజూరైతే చిన్నపాటి దుకాణంతో జీవనోపాధి పొందాలని ఇంకొందరు.. ఆటో, కారు నడిపి కుటుంబాన్ని పోషించాలని మరికొందరు.. ఇలా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 9.5 లక్షలమందికి పైగా నిరుద్యోగ యువత ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తోంది. సొంతకాళ్లపై నిలబడాలని రుణాలకు దరఖాస్తు చేసుకుంటే.. ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేని పరిస్థితి బడుగు, బలహీనవర్గాల యువతను కుంగదీస్తోంది.
సంక్షేమ సహకార సంస్థలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నపుడు లక్షల్లో యువత దరఖాస్తు చేసుకుంటున్నా, ప్రభుత్వమిచ్చే చాలీచాలని నిధులతో కార్పొరేషన్లు కొద్దిమందికే మంజూరు చేస్తున్నాయి. దీంతో జాబితా పెరిగిపోతోంది. రాష్ట్రంలో మూడేళ్ల క్రితం తీసుకున్న దరఖాస్తులకు నేటికీ పరిష్కారం లభించలేదు. మరికొందరికి రుణం మంజూరైనా అది విడుదలకాక ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల పరిధిలోని దరఖాస్తులు చెల్లుబాటులో ఉన్నాయో, లేవో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రభుత్వం అరకొర నిధులే ఇస్తుండగా మరోవైపు మూడేళ్ల క్రితం మంజూరైన రూ. 300 కోట్లలో సగం నిధులు కూడా ఖర్చు చేయలేదు బీసీ కార్పొరేషన్.
సంక్షేమ శాఖలవారీగా ఇదీ పరిస్థితి..
* గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్) పరిధిలో ప్రస్తుతం 2018-19 ఏడాదికి సంబంధించిన దరఖాస్తుల్ని ఇప్పుడు పరిష్కరిస్తున్నారు. ఈ ఏడాది మరో లక్షమంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 2 లక్షలమంది యువత రాయితీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాదికి రూ. 650 కోట్లు కేటాయించినా ఇప్పటికీ విడుదల కాలేదు. 2021-22 ఏడాదికి కొత్తగా కార్యాచరణ సిద్ధం చేసి, గిరిజన ఎమ్మెల్యేలతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. ఇదంతా అయ్యేసరికి మరికొంత జాప్యం జరిగే అవకాశం ఉంది.
* బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల పరిధిలో 2014 తరువాత రుణాల కోసం 2017-18లో ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు, సహకార సమాఖ్యల పరిధిలో 5.70 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రూ.లక్ష లోపు రుణాల కోసం దరఖాస్తు చేసిన 60 వేలమందికి నూరు శాతం రాయితీ కింద రూ.50 వేలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30 వేలమందికి అందజేశారు. వరసగా పార్లమెంటు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కోడ్‌తో పంపిణీ నిలిచిపోయింది. కలెక్టర్ల వద్ద నిధులు అందుబాటులో ఉన్నా ఇప్పుడు కరోనా పేరిట మిగతా 40 వేలమందికి ఇవ్వడంలేదు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల పరిధిలో రూ.లక్షకు పైగా రుణాల కోసం దరఖాస్తు చేసిన దాదాపు 5 లక్షలమందికీ ఎదురుచూపులే మిగిలాయి.
*మైనార్టీ కార్పొరేషన్ పరిధిలో 2014-15లో తీసుకున్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా స్వయం ఉపాధి పథకాలు, రాయితీ రుణాల కోసం దరఖాస్తులు తీసుకోవడం లేదు.
వేచి చూస్తున్న 2 లక్షల మంది ఎస్సీలు ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఏటా 2 లక్షలమందికి పైగా అభ్యర్థులు రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. 2018-19 నుంచి పంపిణీ నిలిచిపోయింది. అప్పటి వరకు ఏళ్లుగా ఎదురుచూస్తున్న 2.47 లక్షల మంది దరఖాస్తులన్నిటినీ ప్రభుత్వం రద్దు చేసి కొత్తగా పెట్టుకోవాలని సూచించింది. 2020-21 ఏడాదికి 1.73 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. 18,285 మందికే రుణాలివ్వాలని ఎస్సీ కార్పొరేషన్ నిర్ణయించింది. 2020-21 ఏడాదికి రూ. 786 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి విడుదల కాలేదు. ఇంటర్వ్యూలకు హాజరైనా యూనిట్లు మంజూరవుతాయో లేదో తెలీని దుస్థితి.
రుణం వస్తదో లేదో...