T-Congress Focus on Assembly Elections 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. అదే తరహాలో రాష్ట్రంలోనూ యువజన కాంగ్రెస్‌ను భాగస్వామ్యం చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగా గాంధీభవన్‌లో కర్ణాటకకు చెందిన యువజన కాంగ్రెస్ నాయకులతో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులను కలిపి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే సమావేశమయ్యారు. సుదీర్ఘంగా చర్చించిన ఠాక్రే యువజన కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించి చురుకైన పాత్ర పోషిస్తే భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.
త్వరలో యువజన కాంగ్రెస్ ఫ్లీనరీ..:పదోన్నతులతో పాటు పార్టీ వ్యవహారాల్లో కీలకమైన పదవులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో బెంగళూరులో యువజన కాంగ్రెస్ ప్లీనరీ నిర్వహించనున్నట్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తెలిపారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని ఛేజిక్కించుకునేందుకు ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు.
గడప గడపకు ప్రచారం..: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు దక్షణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 119 మంది చురుకైన యువజన కాంగ్రెస్ నాయకులను రంగంలోకి దించనుంది. వీరంతా ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల్లో తిష్ఠ వేసి స్థానిక నియోజకవర్గ, మండల, బూత్ స్థాయి యువజన కాంగ్రెస్ నాయకులతో, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటారు. పార్టీపరంగా తీసుకునే విధానపరమైన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే వీరి ప్రధాన లక్ష్యంగా పని చేస్తారు.