తెరాస ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం చేసే ఆర్థిక సాయాన్ని తమ పార్టీ కార్యకర్తలకు, అనుచరులకు మాత్రమే అందిస్తున్నారని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విమర్శించారు.
వరద బాధితులకు యువజన కాంగ్రెస్ సరుకుల పంపిణీ - hyderabad news
వరద బాధితులను ఆదుకోవడంలో తెరాస నేతలు రాజకీయాలు చేస్తూ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ నాగమయ్య కుంటలో వరద ముంపునకు గురైన బాధితులను పరామర్శించి ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులను అందజేశారు.
నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద ముంపుకు గురైన బాధితుల వివరాల సేకరణలో రెవెన్యూ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారని ఆయన తెలిపారు. పేద ప్రజలను ఆదుకోవడంలో రాజకీయాలు చేయవద్దని చెప్పే నాయకులే వరద బాధితులకు ఆర్థిక సహాయం చేసే విషయంలో వివక్షత కనబరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో తిరిగి బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. యువజన కాంగ్రెస్ తరపున బాధితుల వివరాలను సేకరించి రెవెన్యూ అధికారులకు నివేదిక అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి:వరి సన్నరకాలూ ‘ఏ’ గ్రేడే!