Deadly Bike Stunts: సినిమాల్లో చేసే విన్యాసాలను యువత సొంతంగా చేస్తూ.. లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టుకుంటున్నారు. సరదాగా సాహసాలు చేస్తూ.. ప్రాణాలు తీసుకుంటున్నారు. స్తోమత లేకపోయినా తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి మరీ స్పోర్ట్స్ బైక్‌లు కొని.. వాటిపై నిలబడి, పడుకుని రకరకాలుగా స్టంట్‌లు చేస్తున్నారు. వీటికి బీఆర్‌టీఎస్ రోడ్డు, కనకదుర్గ వంతెన, హైటెన్షన్ రోడ్డు, బెంజ్ సర్కిల్ వంతెనలు, ప్రకాశం బ్యారేజి, తదితర ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. వీటితో పాటు విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి కూడా వేదిక అవుతోంది.
Dangerous Bike Stunts : ఈ మార్గంలోని కంకిపాడు, ఉయ్యూరు, తదితర ప్రాంతాల్లోని వంతెనలు, సర్వీసు రోడ్లపై.. యువకులు బైక్‌లపై విన్యాసాలు చేస్తూ వీడియోలు తీస్తున్నారు. ఇలా ప్రమాదకర స్టంట్‌లు వద్దని తల్లిదండ్రులు వారించినా వినకుండా ప్రయత్నించి.. ప్రాణాలు కోల్పోయాడు ఉయ్యూరు పట్టణానికి చెందిన గౌరీ సాయికృష్ణ. 18 సంవత్సరాలకే కన్నుమూశాడు. పమిడిముక్కల మండలం మంటాడ సర్వీసు రోడ్డులో వేగంగా వెళ్తున్న బైక్‌పై నిలబడి విన్యాసాలు చేసే దృశ్యాన్ని చిత్రీకరిస్తుండగా.. బ్యాలెన్స్ తప్పి ప్రమాదానికి గురై తుదిశ్వాస విడిచాడు. విజయవాడ నగరం ఫకీర్‌గూడెం ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల ఖాజా.. స్టంట్ మాస్టర్‌గా పేరు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తుండేవాడు.