ఎక్కడపడితే అక్కడ దొరుకుతుండటం వల్ల ఎక్కువ మంది గంజాయిని ఆశ్రయిస్తున్నారు. దీంతో పాటు కొకైన్, హెరాయిన్, ఓపియం, ఎల్‌ఎస్‌డీ ద్రావణాలు వంటి వాటిని తీసుకుంటున్నారు. మత్తుమందులు వినియోగిస్తున్న వారిలో 80 శాతం యువతే.
చదువుల విషయంలో తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి కూడా కొంతమంది పిల్లలు వ్యసనాల బారినపడటానికి కారణమవుతోంది. కారణాలు ఏవైనా కావచ్చు ఆవేశంతోనో.. ఆనందం కోసమే మొదలవుతున్న ఈ అలవాటు వ్యసనంగా మారుతోంది. పిల్లల్లో ఈ అలవాటు వారి భవిష్యత్తునే కబళిస్తోంది.
తల్లిదండ్రులూ.. ఇలా వద్దు
* మార్కులు, ర్యాంకులు అంటూ నిత్యం పిల్లల వెంటపడడం, ఒక్క మార్కు తక్కువొచ్చినా వారిని అవమానించడం, మా పరువు తీశావంటూ సూటిపోటి మాటలు పసిమనసులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్ల పిల్లల్లో అభద్రతా భావం పెరిగిపోయి ఉద్వేగాల్ని నియంత్రించుకోలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొన్ని సందర్భాల్లో చెడు సావాసాల చెరలో చిక్కుకుంటున్నారు.
* అతి క్రమశిక్షణ, విపరీతమైన స్వేచ్ఛ. ఈ రెండూ కొన్ని సార్లు బెడిసి కొడుతున్నాయి.
* కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు నిత్యం ఘర్షణ పడటం, ఒకర్నొకరు దూషించుకోవడం వంటివి తరచూ చోటుచేసుకుంటాయి. వారి పిల్లలపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఆ సంఘర్షణ నుంచి బయటపడేందుకు చాలా మంది కొత్త కొత్త ఆకర్షణలకు లోనై వాటిల్లో ఆనందం వెతుక్కుంటున్నారు.
* ఏదో కారణంతో తల్లిదండ్రులు విడిపోయిన కొన్ని కుటుంబాల్లో పిల్లలపై సరైన పర్యవేక్షణ కొరవడి వారు పక్కదారి పడుతున్నారు. తండ్రి వ్యసనాలకు బానిసై, బాధ్యతలు విస్మరించిన పలు కుటుంబాలకు చెందిన పిల్లల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటోంది.
పిల్లల కోసం కొంత సమయం..
* నిత్యజీవితంలో ఎంత తీరికలేకుండా ఉన్నా సరే పిల్లలతో గడిపేందుకు తల్లిదండ్రులు కచ్చితంగా కొంత సమయం కేటాయించాల్సిందే.
* పిల్లల అవసరాలకు తగ్గట్టు డబ్బు ఇవ్వాలి. వారు ఆ డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారో గమనించాలి.
* ప్రేమపూర్వక, స్నేహపూర్వక వాతావరణం ఇంట్లో ఉండేటట్లు చూసుకోవాలి.
* పిల్లలు ఎలాంటి స్నేహితులతో మెలుగుతున్నారు? ఇంటికి ఎన్నింటికి వస్తున్నారు? బయటకు వెళ్లాక వారి ప్రవర్తన, ధోరణి ఎలా ఉంటోంది? వంటి అంశాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఈ వ్యసనం బారిన పడకుండా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశాఖపట్నంలోని ‘గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్’ వ్యసన విముక్తి కేంద్ర నిర్వాహకురాలు ఉమారాజ్, విజయవాడకు చెందిన మానసిక నిపుణులు డా.టీఎస్.రావు వివరించారు.
పిల్లల నడవడిక నిత్యం గమనిస్తుండాలని, కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలని పేర్కొంటున్నారు. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించి డీఎడిక్షన్ కేంద్రాల్లో చేర్పించాలని వారు సూచిస్తున్నారు.
* ప్రవర్తనలో విపరీతమైన మార్పులు.. అంటే చిన్న చిన్న విషయాలకూ విపరీతమైన కోపం తెచ్చుకోవడం. అసలు తినకపోవడం. ఒక్కోసారి అతిగా తినడం. వ్యక్తిగత శుభ్రత గురించి పట్టించుకోకపోవడం. కుటుంబ సభ్యులతో కలవడానికి ఇష్టపడకపోవడం.
* ఇంట్లో అప్పుడప్పుడూ డబ్బులు, విలువైన వస్తువులు మాయమవు తుండటం.
* చదువులో, పనితీరులో చురుకుదనం తగ్గటం.
* ఇష్టమైన వ్యాపకాలు, క్రీడలు, ఇతర అంశాలపై ఆసక్తి కనబరచకపోవడం.
* ఏకాగ్రత లేకపోవటం, పరధ్యానంగా ఉండటం.