Young Liu, KTR Started T Works In Hyderabad: హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారం వచ్చి చేరింది. ఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్‌లోనే సత్తా చాటుతున్న భాగ్యనగరం.. ఇకపై హార్డ్‌వేర్‌లోనూ రాణించనుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూతో కలిసి.. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు టీ-వర్క్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
గ్రామీణ ఆవిష్కర్తల భాగస్వామ్యంతో టీ-హబ్ ఇప్పటికే వెంటిలేటర్, విద్యుత్ వాహనాలు, వ్యవసాయ పరికరాలను రూపొందించిందని కేటీఆర్ తెలిపారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదని ఛమత్కరించారు. ఐ అంటే ఇండియా, టీ అంటే తైవాన్ అని పేర్కొన్నారు. ఇండియా సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులకు హబ్.. తైవాన్ హార్డ్‌వేర్ రంగంలో అగ్రగామి ఉందన్న కేటీఆర్.. ఈ రెండు నైపుణ్యాల మేళవింపుతో.. యువత ప్రపంచస్థాయి ఉత్పత్తులు తయారు చేసేందుకు అవకాశముందన్నారు.
టీ-వర్క్స్‌తో భాగస్వామ్యం కోరుకుంటున్నామని ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూ తెలిపారు. హైఎండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులను అసెంబ్లింగ్ చేయడానికి ఉపయోగించే ఎస్‌ఎంటీ.. సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ లైన్‌ను విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. టీ-వర్క్స్ మంచి ఆలోచన అన్న యంగ్ లియూ.. ప్రపంచస్థాయి సదుపాయాలతో వేగంగా నిర్మించారని కితాబిచ్చారు.
T Works In Hyderabad: తెలంగాణలో పెట్టుబడుల కోసం రెండు ప్రాంతాల్ని పరిశీలించానని.. ఇక్కడి హోటల్ నుంచి చూసి ఇది ఇండియానేనా..? అని ఆశ్చర్యపోయానన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందని.. హైటెక్ ఇండస్ట్రీలో వేగంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఫాక్స్‌కాన్ ఛైర్మన్ పేర్కొన్నారు. ఇక్కడి వేగాన్ని చూస్తుంటే వచ్చే నాలుగేళ్లలో.. ఫాక్స్‌కాన్ రెవెన్యూను రెండింతలు చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నానని లియూ తెలిపారు.