Yoga Day At Parade Grounds In Hyderabad : ఈనెల 27న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే యోగా మహోత్సవంలో భాగ్యనగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లోని బేగంపేటలోని హరిత ప్లాజాలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గొప్పతనాన్ని అందరికీ వివరించారు.
వేల సంవత్సరాలుగా యోగా మన జీవితంలో ఒక భాగమై వస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. వ్యక్తి మానసిక పరివర్తనకు యోగా ఎంతగానో దోహదపడుతోందని ఆయన చెప్పారు. యోగా వల్ల మేధస్సు, శక్తి రెండూ పెరుగుతాయని పేర్కొన్నారు. అందుకే యోగాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి తెలియజేశారని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్య సమితి జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో రెండు వందల దేశాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖను నరేంద్ర మోదీ ఏర్పాటు చేసి ఆయుష్ సంపదను ప్రోత్సహిస్తున్నారని హర్షించారు.
యోగా దినోత్సవం దేశంలోని అన్ని గ్రామాల్లోనూ జరగాలి : యోగా దినోత్సవాన్ని అన్ని గ్రామాల్లోని ప్రతి ఇంట్లో జరగాలన్నదే భారత ప్రభుత్వం ఆకాంక్ష అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు. జూన్ 21వ తేదీకీ వంద రోజుల ముందే 'యోగా కౌంట్ డౌన్' పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. 25 రోజుల కౌంట్ డౌన్‌ను ప్రధాని మోదీ సూచన మేరకు.. ఈ నెల 27న హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ 25 అదే రోజు ఉదయం ఐదు గంటలకు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు.
సీఎం కేసీఆర్ వచ్చి మైదానంలో యోగా చేయాలి :రాష్ట్ర సీఎం కేసీఆర్ వచ్చి పరేడ్ మైదానంలో యోగా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు కేంద్రమంత్రులు రాబోతున్నారన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఆరోగ్య శాఖ మంత్రి, గవర్నర్‌ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికే వారికి లేఖలు పంపించామని వివరించారు. హైదరాబాద్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఇవీ చదవండి :