Yoga Mahotsav 2023 In Hyderabad : దీపావళి, ఉగాది పండుగలా యోగాను కూడా ఒక పండుగలా సంతోషంగా జరుపుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరుకొంటున్నారని తెలిపారు. యోగా కౌంట్‌డౌన్‌కు హైదరాబాద్ వేదిక కావడం గొప్ప విషయమన్నారు.
యోగాపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో యోగా మహోత్సవ్ నిర్వహించినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యోగా మహోత్సవ్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర ఆయుష్, ఓడరేవుల, షిప్పింగ్ అండ్ జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, కార్మిక- ఉపాధి పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర ఆయుష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి ముంజపరా మహేంద్రభాయ్ కాళూభాయ్, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించి యోగ చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకొంటున్నామని తెలిపారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతదేశమేనని అన్నారు. యోగా అనేది మన దేశ సంపద, జ్ఞానం, జీవన విధానమని చెప్పారు.
"యోగా దినోత్సవానికి ముందే 25 రోజుల కౌంట్‌డౌన్‌ను భారత ప్రభుత్వం ప్రారంభించింది. ప్రపంచంలో మరే దేశం కూడా ఇలా కౌంట్ డౌన్‌ను ప్రారంభించలేదు. జూన్ 21న ప్రపంచంలోని 200 దేశాలు యోగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాయి. యోగా వేల సంవత్సరాల క్రితం మన దేశంలో పుట్టింది. అందుకే యోగా మనది." - కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి