YOGA DAY CELEBRATIONS: రాష్ట్రంలో ఎక్కడికక్కడ యోగా దినోత్సవం జరిగింది. ఆయా కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం యోగా అని... ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని యోగా శిక్షకులు సూచించారు. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి యోగా ఎంతో ఉపయోగపడుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, హీరో అడవి శేష్ హాజరయ్యారు. యోగా విశిష్టతను తెలియజేసేలా వివిధ ఆసనాలు వేశారు. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. హైకోర్టు వద్ద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతోపాటు పలువురు న్యాయమూర్తులు యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
మహబూబ్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఉత్సాహంగా యోగా చేశారు. భారత్ నుంచి ప్రపంచం యోగా నేర్చుకుంటోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్ట చేశారు. సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని మంత్రి తెలిపారు. హైదరాబాద్ గాజులరామారంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొని యోగాసనాలు చేశారు. యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో యోగా దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఆసనాలు వేశారు. ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.
యువతరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ సూచించారు. హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఇందులో బాలకృష్ణ పాల్గొని ఆసనాలు వేశారు. యోగా దినోత్సవం పురస్కరించుకుని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో వేద విద్యార్థులు, నేత్ర విద్యాలయ విద్యార్థులు, జిమ్స్ మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది ప్రాంగణంలో వేడుకలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టి యోగా చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. పతంజలి యోగా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన యోగాసనాల కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. దశాబ్దాలుగా వనస్థలిపురం పరిధిలో గురువు శ్రీనివాస్ యోగాసనాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారని యోగా సాధకులు కొనియాడారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అన్ని క్రీడల కోచ్ లు, విద్యార్థులు, యోగా శిక్షకులు ఆసనాలు వేశారు. యోగా దినోత్సవం వేళ చార్మినార్ ముందు ఓ యువకుడు 3గంటల 3 నిమిషాల 33 సెకండ్లపాటు తలకిందులుగా యోగా చేశాడు. బిహార్‌కు చెందిన సోను కుమార్ రికార్డు కోసం ఇలా చేశానని.. ఇందుకోసం దాదాపు 6 సంవత్సరాల నుంచి సాధన చేసినట్లు తెలిపాడు.