ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో అధికార వైకాపా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. అంచనాలకు మించి ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఆశించిన దానికంటే అద్భుత ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల అంచనాలను తారుమారు చేసేలా ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, తెదేపా, జనసేన-భాజపా కూటమి ప్రభావం చూపుతుందని అనుకున్న ప్రాంతాల్లోనూ ఫ్యాను గాలి బలంగా వీచింది.
సంక్షేమ పథకాల ప్రభావం...
ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లోనే జగన్‌కు ఎక్కువ ఆదరణ ఉంటుంది... పట్టణ, నగరాల్లో అంత ఉండదనే వాదన ఉండేది. కానీ ఈ ఫలితాలు ఆ అంచనాలను పటాపంచలు చేసింది. జగన్ సంక్షేమ మంత్రం పుర ఎన్నికల్లో పని చేసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన ప్రతీ పథకం ప్రజల్లోకి వెళ్లింది కాబట్టే... ఈ స్థాయి విజయం సాధ్యమైందని వైకాపా నేతలు చర్చించుకుంటున్నారు. ఇతర పార్టీలు గెలిస్తే ఏం చేస్తాయో చెప్పాయని, తాము గెలిచి ఏం చేశామో చూపామని నేతలు అంటున్నారు. అధికారంలో లేని పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వచ్చే లాభం ఏంటనే చర్చ ప్రజల్లో జరిగిందనేది అధికార పార్టీ నేతల అంచనా..!
విశాఖ, అమరావతిలో...
అమరావతిలో రైతుల ఉద్యమం... విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లో వైకాపాకు ఇబ్బంది కలిగిస్తుందని అంతా భావించారు. కానీ ఈ రెండుచోట్లా అధికార పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇక ఇటీవల ఉద్ధృతంగా జరిగిన విశాఖ ఉక్కు ఉద్యమం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని... అదీ వైకాపాకే నష్టం అని విశ్లేషకులు అంచనా వేశారు. విశాఖలోనూ ఫ్యాను పార్టీ జోరు తగ్గలేదు. విశాఖలో తెదేపా గట్టి పోటీ ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రభావం అంతగా కనిపించలేదు.
ద్వితీయ శ్రేణి నేతలు సక్సెస్...
పురపాలక ఎన్నికల్లో వైకాపా ఈ స్థాయిలో విజయం సాధించడానికి ద్వితీయ శ్రేణి నేతలు ప్రధాన కారణమనే మాట వినిపిస్తోంది. మొదట ఎన్నికలు పెట్టడాన్ని వ్యతిరేకించిన వైకాపా... ఆ తర్వాత స్పష్టమైన అవగాహనతో పావులు కదిపింది. అభ్యర్థుల ఎంపిక మొదలు... ఓటర్లను పోలింగ్‌కు తీసుకొచ్చే దాకా పక్కా వ్యూహంతో రాజకీయం చేసింది. ప్రచారంలోనూ వైకాపా నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎక్కడా ఎవరినీ ఇబ్బందిపెట్టే విధంగా మాట్లాడకుండా... సైలెంట్‌గా వారి పని వారు చేసుకున్నారు. కిందిస్థాయి కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ... మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గస్థాయి నేతలు ఈ విజయానికి బాటలు వేసుకున్నారు.