కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. తనకు పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసు చెల్లుబాటు అంశంపై ఆయన చర్చించారు. అసలు పార్టీ పేరు, షోకాజ్ నోటీసుపై పేర్కొన్న పార్టీ మధ్య వ్యత్యాసంపై ఆరా తీశారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం సాగింది.
సభ్యులెవరో చెప్పండి..!
వైకాపా క్రమశిక్షణ కమిటీ, దాని సభ్యులు ఎవరో చెప్పాలని.. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని.. ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కోరారు. పార్టీ సభ్యుడికి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ పోతుందా.. అలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా.. అని ఎంపీ వారిని అడిగారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు.. ఈ తరహా కేసులను తొలిసారి చూస్తున్నట్లు ఎంపీతో చెప్పారు. ఈ సమాచారం మంగళవారంలోగా ఇస్తామని తెలిపారు. అయితే సంబంధిత అధికారి లేకపోవడం వల్ల ఎంపీ రఘురామకృష్ణరాజు.. మరోసారి ఈసీ అధికారులను కలవనున్నారు.