Jagan Disproportionate Assets case : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ-హౌసింగ్ బోర్డుకు చెందిన కేసు నుంచి తమను తప్పించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తోపాటు ఆయనకు చెందిన వసంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. నిందితులపై సీబీఐ చేసిన ఆరోపణలను ప్రాథమిక దశల్లో తోసిపుచ్చలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. కింది కోర్టులో విచారణకు ఎలాంటి సమాచారం లేదనీ చెప్పలేమన్నారు.
సీబీఐ అభియోగ పత్రంలోని అంశాలను పరిశీలించాక ఈ నిర్ణయానికి రాలేరని.. విచారణలోనే తేలాలని పేర్కొన్నారు. ఎవిడెన్స్ చట్టంలోని సెక్షన్ ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది చేసిన కుట్రలో ఒకరి పాత్ర ఉన్నా విచారణ చేయవచ్చని, మిగిలిన వారి పాత్ర ఉందా లేదా అన్నది విచారణలో సమర్పించే సాక్ష్యాల ఆధారంగా తేలాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈమేరకు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు.