ycp leaders harassment: శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ.. ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ నాయకుల ఆగడాలే కనిపిస్తున్నాయి. వారి పదఘట్టనల్లో నలిగిన బాధితుల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. మూడున్నరేళ్లుగా హద్దే లేదన్నట్లు వైసీపీ నాయకుల అరాచకాలు సాగుతున్నాయి. వాటిలో ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి నవంబర్ 21 మధ్య 113 రోజుల వ్యవధిలో జరిగిన ఘటనల్లో కొన్నింటిని 'ఈనాడు-ఈటీవీ' పరిశీలించాయి.
బాధితుల్లో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలే అధికంగా ఉన్నారు. వైసీపీ నాయకుల అరాచకాలపై కొన్నిచోట్ల కనీసం కేసులు కూడా నమోదు కాలేదు. మరికొన్ని ఘటనల్లో కేసు నమోదైనా అరెస్టు చేయలేదు. ఇంకొన్నింటిలో కీలక నిందితుల్ని కేసు నుంచి తప్పించారు. మొత్తం 47 ఘటనలను పరిశీలించగా... అందులో ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనారిటీలు బాధితులుగా ఉన్న ఘటనలు 30 ఉన్నాయి.
అంటే 63.83 శాతమన్నమాట. బాధితుల్లో ఎస్సీలు 11 మంది ఉండగా, ఎస్టీలు ఇద్దరు, బీసీలు 16 మంది, మైనారిటీలు ఒకరు ఉన్నారు. మరో 10 ఘటనల్లో ఇతరవర్గాల వారు బాధితులని తేలింది. ఇవి కాకుండా విపక్ష పార్టీల కార్యాలయాలు, అన్నక్యాంటీన్లపై దాడులు, కూల్చివేతలు ఉన్నాయి. వైసీపీ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నవారు ఆరుగురు ఉండగా... వీరిలో ఇద్దరు దళితులు, ముగ్గురు బీసీలు, ఒకరు ఇతర వర్గాల వారిగా నిర్ధరణ అయింది.
వైసీపీ నాయకులు, అధికారులు కలిసి దౌర్జన్యం: ఆత్మహత్యాయత్నం చేసిన ఐదుగురిలో ముగ్గురు బీసీలు, ఒకరు ఎస్టీ, ఇంకొకరు ఇతరులు ఉన్నారు. వైసీపీ నాయకులు, అధికారులు కలిసి దౌర్జన్యం చేయడం వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఎస్సీ వ్యక్తి దుగ్గిరాల కరుణాకర్... వైసీపీ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నారు. 20 లక్షలు అప్పుచేసి చెరువులో చేపలు పెంచితే, వాటిని పట్టుకోనివ్వకుండా వైసీపీ సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఆయన అనుచరుడు సురేష్‌రెడ్డి అడ్డుకుంటున్నారంటూ జిల్లా ఎస్పీకి... కరుణాకర్ లేఖ రాశారు.
తన తల్లితో కలిసి జగదీశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని లేఖలో వాపోయారు. ఈ కేసులో కొన్ని రోజులు రిమాండ్‌లో ఉన్న నిందితులు.. బెయిలుపై బయటకొచ్చారు. జగదీశ్వర్‌రెడ్డి శ్రీశైలం బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. వైసీపీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ ఉపాధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ, ఆయన సోదరుడు గంగాధర్, ఎస్సై కిరణ్ కుమార్ బెదిరింపులు భరించలేకపోతున్నానంటూ లేఖ రాసి.. ఎస్సీ వర్గానికి చెందిన ఆక్వా రైతు బూరగ నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు.
నాగేశ్వరరావు వద్ద పనిచేసే సురేష్.. పక్షులను బెదరగొట్టేందుకు నాటు తుపాకీ పేలుస్తూ గాయపడ్డారు. అతనికి 10 లక్షలు చెల్లించాలని సత్యనారాయణ, గంగాధర్ బెదిరించారు. అంత ఇవ్వలేననటంతో అదే రోజు రాత్రి నాగేశ్వరరావును పోలీసు స్టేషన్‌కు పిలిచిన ఎస్సై కిరణ్‌కుమార్... బెదిరించడంతోపాటు కొట్టారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో సత్యనారాయణ మినహా మిగిలిన వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత సత్యనారాయణ లొంగిపోయారు.
ఎస్సై కిరణ్‌కుమార్ ఇటీవల బెయిల్‌పై విడుదలవగా... మిగతావారు రిమాండ్‌లో ఉన్నారు. తన భర్త చావుకు కారణమైన ఎస్సైకి నెల రోజుల్లోపే బెయిలు ఇచ్చేశారని.. మిగతా నిందితులూ బయటకొచ్చేస్తామని చెబుతున్నారంటూ నాగేశ్వరరావు భార్య సౌదామిని వాపోయారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ గోవిందపురానికి చెందిన కడియాల అచ్చియమ్మకు... ఆమె సోదరులు సారిపల్లి భీమేశ్వరరావు, సోమేశ్వరరావు రెండు సెంట్ల స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ భూమిపై వైసీపీ నాయకులతో వివాదం ఉంది.