అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసిన వైకాపా కార్యకర్త సొంత పార్టీ వారి చేతిలోనే హత్యకు గురయ్యాడు. ఏపీ కడప జిల్లా కొండాపురం మండలం పి.అనంతపురంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో గురునాథ్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గండికోట జలాశయం ముంపు గ్రామాల వారికి ప్రభుత్వం పరిహారం మంజూరు చేస్తోంది. అయితే జాబితాలో అనర్హులు ఉన్నారని వైకాపా కార్యకర్త గురునాథ్ రెడ్డి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా పి. అనంతపురంలో రెవెన్యూ అధికారులు గ్రామసభ ఏర్పాటు చేసి, అనర్హుల ఏరివేత ప్రక్రియ చేపట్టారు. అభ్యంతరాలు స్వీకరిస్తున్న సమయంలో అధికారులకు ఫిర్యాదు చేసింది ఇతడే అంటూ కొందరు గురునాథ్ రెడ్డితో గొడవకు దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన గురునాథ్ రెడ్డిని తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.