తెదేపా జాతీయ కార్యాలయంతో పాటు, పార్టీ నాయకుడు పట్టాభిరామ్ ఇంటిపై మంగళవారం సాయంత్రం అల్లరిమూకల దాడులు, రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తెదేపా కార్యాలయాలపై వైకాపా నాయకులు, కార్యకర్తల దాడి యత్నాలు, తెదేపా నాయకుల ఇళ్ల ముందు ధర్నాలతో రాష్ట్రం అట్టుడికింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై ఒక ప్రణాళిక ప్రకారం దాడులు జరగడం ప్రజల్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనలన్నీ మంగళవారం సాయంత్రం దాదాపు ఒకే సమయంలో జరిగాయి. ఈ దాడులతో తెదేపా శ్రేణులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నాయి. వైకాపా నాయకులు, పోలీసులు కుమ్మక్కై ఈ అరాచకానికి తెగబడ్డారని మండిపడుతున్నాయి. బుధవారం రాష్ట్ర బంద్‌కు తెదేపా పిలుపునిచ్చింది.
దాడులపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్లో ఫిర్యాదు చేశారు. తెదేపా చరిత్రలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, కానీ ఇలా ఒక పార్టీ కార్యాలయంపై దాడులకు పాల్పడటంతో ఒక దుష్ట సంప్రదాయానికి తెర తీసినట్టయిందని వివిధ రాజకీయ పక్షాలు ఖండించాయి. తెదేపా ఆరోపణల్ని వైకాపా ఖండించింది. తెదేపా కార్యాలయాలపై తాము దాడులు చేయలేదని, ఎవరితోనో రాళ్లు వేయించడం, భౌతికంగా ఇబ్బంది పెట్టడం తమ విధానం కాదని వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు పేర్కొన్నారు.
తెదేపా కార్యాలయాలపై దాడులు రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి విశృంఖలంగా సాగవుతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు సోమవారం ఆరోపణలు చేయడంతో... నర్సీపట్నం పోలీసులు హుటాహుటిన గుంటూరు వచ్చి సోమవారం అర్ధరాత్రి ఆనంద్‌బాబు ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఈ పరిణామాలపై తెదేపా నాయకుడు పట్టాభిరామ్ మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రిపైనా, ప్రభుత్వంపైనా, పోలీసులపైనా పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని పట్టాభిరామ్ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేసి, బీభత్సం సృష్టించారు.
అనంతలోనే...
కాసేపటికి మంగళగిరి సమీపంలో, డీజీపీ కార్యాలయానికి అత్యంత దగ్గర్లో ఉన్న తెదేపా జాతీయ కార్యాలయంపై పదుల సంఖ్యలో దుండగులు విరుచుకుపడి విశృంఖలంగా దాడికి పాల్పడ్డారు. భయానక వాతావరణం సృష్టించారు. పార్టీ నాయకుడు దొరబాబుతో పాటు మరో ముగ్గురు కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిని ముందే పసిగట్టిన తెదేపా కార్యాలయ వర్గాలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. డీజీపీ కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలోనే ఇంత బీభత్సం జరుగుతున్నా... పోలీసులు రాలేదు. చేయాల్సిన విధ్వంసమంతా చేసి, అల్లరిమూకలు తీరిగ్గా వాహనాలు ఎక్కి వెళ్లిపోయాక అప్పుడు పోలీసులు వచ్చారు.