రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. క్రిస్మస్‌ను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విద్యుత్ దీపాల అలంకరణతో చర్చిలు శోభాయమానంగా కనిపిస్తున్నాయి. పలు చర్చిల్లో రాత్రి నుంచే క్రిస్మస్ సంబురాలు మొదలయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన క్రిస్టియన్లు ఆహ్లాదంగా సంబురాలు చేసుకున్నారు. పాస్టర్లు, బిషప్‌లు ఏసు బోధనలను తెలియజేశారు. ఏసు జన్మ వృత్తాంతాన్ని వివరించారు. ప్రార్థనలు, భక్తి గీతాల ఆలాపన మధ్య వేడుకలు మనోహరంగా సాగాయి.
విద్యుత్‌దీపాల కాంతుల్లో..
సికింద్రాబాద్ సెయింట్‌మేరీ, వెస్లీ చర్చిలలో సంబరాలు అంబరాన్నంటాయి. క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకూ సంబురాలు సాగాయి. మళ్లీ తెల్లవారుజామునుంచే చర్చిలకు వచ్చారు. కూకట్‌పల్లిలోని ట్రినిటీ చర్చి విద్యుత్ దీపాల అలంకరణతో కాంతులీనింది. చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపే బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది.