తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉస్మాన్‌నగర్‌లో దారుణ పరిస్థితులు.. ఏ వీధి చూసినా నీరే!

ఒకవైపు పాకురు పట్టిన వీధులు.. మురుగుతో వచ్చే దుర్గంధం.. మరికొంత ముందుకు వెళితే మునిగిపోయిన ఇళ్లు.. ప్రతి వీధిలో దాదాపు పది అడుగుల ఎత్తులో నిలిచిన నీరు.. ఇదీ హైదరాబాద్​ శివారులో జల్​పల్లి పరిధిలో పరిస్థితి. కొన్ని వీధుల్లో వరద తగ్గినా బురద, మురుగు పేరుకుపోయి కనీసం నడిచి వెళ్లే పరిస్థితులు లేవు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది.

Worse conditions filled with flood water in Usman Nagar
ఉస్మాన్‌నగర్‌లో దారుణ పరిస్థితులు.. ఏ వీధి చూసినా నీరే!

By

Published : Nov 9, 2020, 10:24 AM IST

భాగ్యనగర శివారులోని జల్‌పల్లి పరిధి ఉస్మాన్‌నగర్, హబీబ్‌కాలనీ సహా ఆరు కాలనీలు ఇంకా ముంపులోనే ఉండిపోయాయి. అక్టోబరు 13న వచ్చిన వర్షాలతో బురాన్‌ఖాన్‌ చెరువు(వెంకటాపూర్‌ చెరువు) ఉప్పొంగి ఉస్మాన్‌నగర్‌ ప్రాంత వీధుల్లో వరద నిలిచింది. 'ఈనాడు- ఈటీవీ భారత్' క్షేత్రస్థాయిలో పర్యటించగా ఇంకా అదే పరిస్థితి కనిపించింది. కొన్ని వీధుల్లో వరద తగ్గినా బురద, మురుగు పేరుకుపోయి కనీసం నడిచి వెళ్లే పరిస్థితులు లేవు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది.

సొంతిళ్లు వదులుకుని..

కాలనీల్లో 350 ఇళ్లు ముంపులోనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అనేక కుటుంబాలు 25 రోజులుగా సమీపంలోని అద్దె ఇంట్లో లేదా బంధువుల వద్ద ఉన్నారు. బురాన్‌ఖాన్‌ చెరువుకు ఉన్న స్లూయిజ్‌ నుంచి నీటిని విడుదలచేస్తే తాము ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని దిగువ కాలనీల ప్రజలు ఒప్పుకోవడంలేదు. ఆ ప్రవాహం ఎటూ వెళ్లే దారి లేక వీధుల్లోనే నిలిచింది.

చుట్టూ నీరే ఉందంటున్న బాధితురాలు

ఉస్మాన్‌నగర్‌లో 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఈ నెల 13న అమ్మాయి పెళ్లి చేయాలనుకున్నాం. దుస్తులు, సామగ్రి కొనుగోలు చేసి ఉంచాం. వర్షాలతో ఇంట్లో పది అడుగుల ఎత్తులో నీరు చేరింది. 20 రోజులుగా ఇదే పరిస్థితి. కొంత సామగ్రి తీసుకుని బయట పడగలిగాం. కానీ వాషింగ్‌ మెషిన్‌ వంటివి కొట్టుకుపోయాయి. పెళ్లి వాయిదా పడింది. వేరొక చోట అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటున్నాం. ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించి మాకు పట్టాలు ఇవ్వాలి.

- జల్‌పల్లి పరిధిలోని ఉస్మాన్‌నగర్‌కు చెందిన తహీయాబేగం ఆవేదన

‘‘గత నెల 13న వచ్చిన భారీ వర్షానికి ఇళ్లన్నీ మునిగిపోయాయి. 8-10 అడుగుల ఎత్తు నీళ్లలో నానుతున్నాయి. బంధువుల వద్ద ఉంటున్నాం. మా ఇంట్లో ఎల్‌ఈడీ టీవీ, ఫ్రిజ్, వాషింగ్‌ మెషీన్, అల్మరాలు నీళ్లలోనే ఉండిపోయాయి. వాటిని తెచ్చుకునే దారి లేదు. అవి ఉపయోగపడతాయన్న నమ్మకమూ లేదు. రూ.2.50 లక్షల విలువైన సామగ్రి పాడైపోయింది. మా సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.’’

- జీనత్‌బేగం, ఉస్మాన్‌నగర్‌

ఇళ్లలో చీకట్లు

ఇళ్లల్లోని మురుగు పారేందుకు నాలాలను బురాన్‌ఖాన్‌ చెరువులోకి అనుసంధానించారు. ప్రస్తుతం చెరువులోని నీరు వెనక్కి వస్తుండటంతో ఈ మురుగు పారే దారి లేకపోయింది. వీధుల్లో మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. దీనికితోడు గత నెలలో వరద వచ్చినప్పట్నుంచి తమ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని స్థానికులు వాపోతున్నారు.

ఇదీ చదవండిఃసురక్షిత ప్రయాణానికి ద.మ. రైల్వేలో.. ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ వ్యవస్థ

ABOUT THE AUTHOR

...view details