ఒకప్పుడు సహజ వనరు అయిన నీరు.. నేడు వాణిజ్య వస్తువుగా మారిపోయింది. ఎప్పుడో కాలజ్ఞానంలో భవిష్యత్తులో నీరు కొనుక్కుని తాగుతారని విన్నప్పుడు అవునా.. అలాంటి రోజులొస్తాయా అనుకున్నారు పెద్దలు. నేడు ఆ రోజులొచ్చేశాయి. మన పూర్వీకుల కాలంలో నీటి జాడ ఏటిలో సంవృద్ధిగా కనిపించేది.. కాలం గడిచిన కొద్దీ.. చెరువుల్లో చూశారు... తర్వాత బావి దశకు వచ్చేసింది... నేడు బాటిల్లో కనిపిస్తుంది. ఇలాగే నీటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించుకుంటూపోతే... భవిష్యత్తులో నీటి జాడ కన్నీటిలోనే చూడాల్సి వస్తుందంటే అతిశయోక్తి కాదు.
చుట్టూ నీరున్నా గొంతు తడవదు
భూమండలంపై మూడొంతుల జలం ఉన్నా.. నేటికీ తాగడానికి నీరు లేక ఎంతో మంది కటకడలాడుతున్నారు. తాగు నీరు కావాలంటే.. వర్షాలు కురవాలని... ఆ వాన నీటినే డబ్బాలో పట్టుకుని దాచుకుని తాగుతారని... బిందె నీళ్ల మైళ్ల దూరం నడిచి పడిగాపులు కాచుకుని నీళ్లు తెచ్చుకుంటున్న పరిస్థితి.. వాగులో పారే తాగు నీరని.. కుంటల్లో జలమే జీవనాధారమని బతుకుతున్నవారు నేటికీ ఎందరో ఉన్నారంటే నమ్మసఖ్యంగా లేదు కదూ.. తాగడానికే గ్లాసులు లెక్కపెట్టుకుని తాగుతూ.. స్నానం చేయాలంటే వర్షాకాలం కోసం ఎదురు చూస్తున్నవారు ఎందరో ఉన్నారు. ప్రపంచంలో 80కి పైగా దేశాలు కటిక నీటి కష్టాలు అనుభవిస్తున్నాయి.
అప్పుడు అమృతం... నేడు గరళం
ఈ చెరువులోనే మేము నీళ్లు తాగే వాళ్లం. ఈ వాగు, నదులే అప్పుడు మాకు దాహం తీర్చేవి. మా రోజుల్లో ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉండేది. ఇలాంటి మాటలు పెద్దల వద్ద తరచూ వింటుంటాం. కానీ అభివృద్ధి పేరుచెప్పి.. అమృతతుల్యమైన జలాన్ని మన చేతులారా గరళంగా మార్చేసుకుంటున్నాం. ఊళ్లలో చెరువులు బీటలువారాయి. పట్టణాల్లో నదులు కనుమరుగైపోయాయి. వీధుల్లో బావులు పూడుకుపోయాయి. ఇళ్లలో బోరులు ఎండిపోయాయి. ఉన్నా అరకొర నీటి వసతులు ఆక్రమణలు, ఫ్యాక్టరీల వ్యర్థాలతో మురికి కూపంగా మారిపోయాయి.
ఒడిసి పట్టుకుంటే జల సిరులు పూయిస్తుంది
సృష్టిని నడిపించే జలచక్రం మానవ జీవన మనుగడను నిర్దేశిస్తోంది. మనం ఎంత హాని చేస్తున్నా అమ్మవలే అన్నీ సమకూరుస్తుంది. సెగలు కక్కుతూ ఆవిరై ఆకాశాన్ని చేరినా మబ్బై చల్లబడి ఎండిపోతున్న పంటను చిగురింప చేస్తుంది. ఎన్నో వ్యర్థాలతో నింపేస్తున్నా... గరళాన్ని తాను మింగి జలాన్ని అందిస్తోంది. ఉప్పుసాగరాలోకి వెళ్లలేక వెళ్లలేక... ఎక్కి ఎక్కి ఏడుస్తూ.. సాగరాన్ని చేరుతుంది. ఆనకట్ట కట్టి కాలువలోకి చేరుతున్న చోట పచ్చని పకృతిని తీసుకొస్తూ.. సిరిగల గంగమ్మ ఆనందందో నురగలు కక్కూతూ బిరబిరా పరుగెడుతోంది.