ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కుమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని గిరిజన మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి సత్యవతి రాఠోడ్, సీఎస్ సోమేశ్ కుమార్...ఆదివాసీలకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. గిరిజన అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎల్లవేళలా కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు.
చిత్తశుద్ధి ఉంటే..
ట్యాంక్‌బండ్ వద్ద కుమురం భీం విగ్రహానికి భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 12 శాతం రిజర్వేషన్ల అంశంపై కేంద్రానికి లేఖ పంపించాలని.. కేంద్రాన్ని తాము ఒప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. పొడు భూములను రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు పంపిణీ చేయాలని సోయం బాపురావు కోరారు.