తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరావతికి ఆగిన నిధులు.. ప్రశ్నార్థకంగా రాజధాని పనులు - ఆంధ్రప్రదేశ్ రాజధాని

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి.. ఎదురు దెబ్బ తగిలింది. సుస్థిర రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంకు తప్పుకుంది. బ్యాంకు వెబ్ సైట్ లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిని ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతోంది? రాజధాని నిర్మాణాన్ని ఎలా ముందుకు తీసుకుపోతుంది?

World_bank_drops_funds_to_amaravathi_capitalcity_of_andrapradesh

By

Published : Jul 19, 2019, 7:23 AM IST

అమరావతి సుస్థిర రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకొంది. తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు.. ప్రపంచ బ్యాంకు వెబ్ సైట్ లో అమరావతి సుస్థిరాభివృద్ధి ప్రాజెక్టు కోడ్ నెంబరు పి-159808 ను డ్రాప్ చేసినట్టుగా చూపింది. ఫలితంగా... రాజధాని నిర్మాణ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులు ఆగిపోయినట్టు స్పష్టమవుతోంది.

2016లో రుణానికి అంగీకరించిన బ్యాంకు

రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ. 7 వేల 200 కోట్ల రుణ సాయం కావాలంటూ.. 2016లోనే బ్యాంకుకు సీఆర్డీఏ ప్రతిపాదన పంపింది. ఈ మేరకు సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రపంచబ్యాంకు.. తొలిదశ కింద రూ. 3 వేల 600 కోట్ల రుణాన్ని అందించాల్సి ఉంది. ఇంతలోనే.. ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొంది.

ఫిర్యాదులే కారణమా?

అమరావతి పరిధిలో నివసిస్తున్న కొందరు ప్రజలు, రైతులు.. నిర్మాణ పనుల తీరుపై ఇటీవల ప్రపంచబ్యాంకు తనిఖీ ప్యానెల్‌కు ఫిర్యాదు చేశారు. వీరికి కొన్ని స్వచ్ఛంద సంస్థలూ జత కలిశాయి. రాజధాని భూసమీకరణలో అవకతవకలు జరిగాయంటూ.. క్షేత్రస్థాయికి వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు సైతం స్థానిక రైతులు ఫిర్యాదులు చేశారు. ఈ అంశంపై పరిశీలన చేసిన బ్యాంకు.. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో రాష్ట్రానికి ఓ లేఖ రాసింది. మరోసారి తాము పనుల తీరును పూర్తి స్థాయిలో తనిఖీ చేయించాలనుకుంటున్నట్టు తెలిపింది. అయితే.. తాము కొత్తగా అధికారంలోకి వచ్చినందున.. కొంత సమయం కావాలని ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం ద్వారా వర్తమానం పంపింది. ఇందుకు అంగీకరించని ప్రపంచ బ్యాంకు.. ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. ఫలితంగా.. ప్రపంచ బ్యాంకు నిధులే కాకుండా.. ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి వచ్చే 200 మిలియన్ డాలర్ల రుణం కూడా వెనక్కు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

కేంద్రమూ ఓ చెయ్యేసినట్టుంది

ఈ పరిస్థితికి కేంద్రమూ ఓ కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రపంచబ్యాంకు తనిఖీ ప్రతిపాదనను ఆమోదిస్తే.. ప్రతిసారీ ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశం ఉందని కేంద్రం భావించినట్టు సమాచారం. ఈ కారణంగానే.. ప్రపంచ బ్యాంకు ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించని పరిస్థితులే.. తాజా పరిణామాలకు దారి తీశాయని తెలుస్తోంది.

ఇవీ చూడండి: జవాబుదారీతనం, వికేంద్రీకరణే లక్ష్యంగా కొత్త పుర చట్టం

ABOUT THE AUTHOR

...view details